ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. మరో మంత్రి క్లారిటీ
నిన్న(మంగళవారం) కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఫ్రీ బస్ పథకంపై ట్వీట్ పెట్టి డిలీట్ చేయగా.. మరో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
కర్నాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ బస్..
ఏపీలో మాత్రం ఉచిత బస్సు మహిళలను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు, విధి విధానాలేంటి..? ఎవరెవరికి ఉచితం..? ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి..? అనేది సస్పెన్స్ గా మారింది. నిన్న(మంగళవారం) కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఫ్రీ బస్ పథకంపై ట్వీట్ పెట్టి డిలీట్ చేయగా.. మరో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి ఫ్రీ బస్ పథకంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదు. కేబినెట్ లో దీనిపై చర్చ జరగొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ట్వీట్ వేశారు. ఆగస్ట్-15నుంచి ఫ్రీబస్ పథకం అమలులోకి వస్తుందన్నారు. ఆ వెంటనే దాన్ని డిలీట్ చేశారు. ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అసలు విషయం చెప్పారు. ఆగస్ట్-15 అంటూ ఆయన డెడ్ లైన్ మాత్రం చెప్పలేదు కానీ, త్వరలోనే ఈ పథకం అమలవుతుందన్నారు. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందని కూడా వివరించారు మంత్రి.
తెలంగాణలో ఉచిత బస్సు వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో కాలు పెట్టడానికి కూడా సందు ఉండటంలేదు, పురుషుల ప్రయాణం మరీ కష్టంగా మారింది. సీట్ల విషయంలో గొడవలు సహజంగా మారాయి. ఇక ఆటో డ్రైవర్ల ఉపాధికి గండిపడింది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. కర్నాటక, తెలంగాణ కంటే మెరుగైన విధానం ఏపీలో ఉంటుందని అంటున్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ పథకం ఎప్పట్నుంచి అమలవుతుందనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.