Telugu Global
Andhra Pradesh

కూటమి ప్రభుత్వంలో తొలి డెడ్ లైన్.. 2026నాటికి ఎయిర్ పోర్ట్ పూర్తి

ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం అనుసంధానం చాలా అవసరం అన్నారు మంత్రి రామ్ మోహన్ నాయుడు. ఎయిర్‌ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అధికారులతో మాట్లాడారు.

కూటమి ప్రభుత్వంలో తొలి డెడ్ లైన్.. 2026నాటికి ఎయిర్ పోర్ట్ పూర్తి
X

2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం చాలా విషయాల్లో డెడ్ లైన్లు పెట్టింది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్.. ఇలా డెడ్ లైన్ పెట్టిన పని ఏదీ పూర్తి చేయలేకపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా డెడ్ లైన్లు పెట్టింది కానీ పని జరగలేదు. కారణాలేవైనా రెండు ప్రభుత్వాలు డెడ్ లైన్లు పెట్టిన పనులు పూర్తి చేయలేకపోయాయి. అందుకే ఈసారి సీఎం చంద్రబాబు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. నాలుగేళ్లయినా పోలవరం పూర్తి కాలేదని తేల్చి చెప్పారు కానీ, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేదు. అమరావతి విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉన్నారు, డెడ్ లైన్ ప్రకటించలేదు. అయితే తాజాగా భోగాపురం విమానాశ్రయం విషయంలో మాత్రం కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. 2026నాటికి భోగాపురంలో విమానాలు ఎగురుతాయని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం అనుసంధానం చాలా అవసరం అన్నారు మంత్రి రామ్ మోహన్ నాయుడు. ఎయిర్‌ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అధికారులతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామన్నారు. దేశంలోనే నెంబర్‌వన్‌ విమానాశ్రయంగా భోగాపురం ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు మంత్రి రామ్ మోహన్ నాయుడు.

గత ప్రభుత్వంపై విమర్శలు..

భోగాపురం విమానాశ్రయం ప్రణాళికలో 2,700 ఎకరాలు ఉండగా.. గత ప్రభుత్వం 500 ఎకరాలు తగ్గించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు మంత్రి రామ్ మోహన్ నాయుడు. కావాలనే పనులను ఆలస్యం చేసిందన్నారు. డిసెంబరు నాటికి టెర్మినల్‌ భవనం పూర్తి చేస్తామని, 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు పూర్తవుతాయన్నారు. చిన్న చిన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామన్నారు మంత్రి. ఇది పూర్తయితే సుమారు 6లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలవారు కూడా ఇక్కడికే వస్తారని చెప్పారు.

First Published:  9 July 2024 1:11 PM GMT
Next Story