Telugu Global
Andhra Pradesh

రూ.15 వేల కోట్ల సాయం.. వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్

వైసీపీ ట్వీట్‌పై స్పందించింది తెలుగుదేశం పార్టీ. అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం అనేది చట్టంలోనే ఉందని, దాని ప్రకారమే రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి ఇస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

రూ.15 వేల కోట్ల సాయం.. వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్
X

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది. ఈ కేటాయింపులు అప్పా లేక గ్రాంటా అనే దానిపై చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై తెలుగుదేశం, వైసీపీ మధ్య ట్విట్టర్‌ వార్ నడుస్తోంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందని తెలుగుదేశం, ఎల్లో మీడియా ఊదరగొడుతున్నాయని, కానీ కేంద్రం ఇచ్చింది అప్పు తెచ్చుకోవడానికి ష్యూరిటీ మాత్రమే అంటూ ట్వీట్ చేసింది వైసీపీ. బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి దక్కింది సున్నా అని ఎద్దేవా చేసింది. అసలు విషయం అర్థమై తెలుగుదేశం పార్టీ తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తోందంటూ సెటైర్ వేసింది.



వైసీపీ ట్వీట్‌పై స్పందించింది తెలుగుదేశం పార్టీ. అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం అనేది చట్టంలోనే ఉందని, దాని ప్రకారమే రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి ఇస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారంటూ టీడీపీ కౌంటర్‌ ట్వీట్ చేసింది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్ర వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటుంద‌ని నిర్మలా చెప్పారంటూ అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది టీడీపీ. 15 వేల కోట్ల బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది.


కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ అంశంపై స్పందించారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని ఏపీ రీ-ఆర్గనైజేషన్‌ యాక్ట్‌లో ఉందని చెప్పారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్‌ నుంచి ఇప్పిస్తామన్నారు. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుందన్నారు. ఇక స్టేట్ తిరిగి ఇస్తుందా, ఇవ్వదా అనేదానిపై తర్వాత మాట్లాడుకుంటామన్నారు. రాజధాని లేకుండా పదేళ్లుగా ఏపీ ఉందన్నారు నిర్మల. దానికి తాను ఎవరినీ బాధ్యులను చేయడం లేదన్నారు. రాజధాని పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

First Published:  23 July 2024 4:29 PM GMT
Next Story