ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన నందమూరి కుటుంబసభ్యులు
నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న బాలకృష్ణ, ఎన్టీఆర్, పురందేశ్వరీ

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బసవతారకం ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎనీఆర్ అని తెలిపారు. ఆయన విప్లవాన్ని తీసుకొచ్చారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందన్నారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఆయన అంటే నటనకు నిర్వచనం. సవరసాలకు అలంకారమని కొనియాడారు. ఆయన ఒక వర్సిటీ.. జాతికి మార్గదర్శకమని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి వారికి మరణం ఉండదని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. నాడు 330కి పైగా తాలూకాలను, 1000కి పైగా మండలాలుగా విభజించి పాలనను సులభతరం చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకొచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించారు. తెలుగు వారి గుండెల్లో ఆయన చిరస్మరణీంగా నిలిచిపోయారు. యువత, డాక్టర్లు, ఇంజినీర్లను ఎంతోమందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అని బాలకృష్ణ తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని నందమూరి రామృకృష్ణ అన్నారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను సీఎం చేశారని చెప్పారు. ప్రాంతాలు వేరైనా తెలుగువారంతా ఒకటేనని ఆయన చాటారన్నారు.
ఎన్టీఆర్‌ది మరణం లేని జననం
విజయవాడలో ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాళి అర్పించారు. ఎన్టీఆర్‌ది మరణం లేని జననం అని కొనియాడారు. ఏ రంగంలోకి వెళ్లినా ఆ రంగానికి వన్నెతెచ్చారు. సినిమా చరిత్రకు కొత్త గుర్తింపు తెచ్చారు. రాజకీయాల్లోనూ తనకంటూ కొత్త చరిత్ర రాశారని వివరించారు. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని.. జన్మజన్మలకు ఆయనకు కుమార్తెగానే పుట్టాలని కోరుకుంటున్నట్లు పురందేశ్వరీ తెలిపారు.
ఎన్టీఆర్‌కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం
ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమానా వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తాం. విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నాం. తెలంగాణలో పార్టీ పునర్మిర్మాణంపై చర్చిస్తున్నాం. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నాంరు. టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉన్నదని నారా లోకేశ్ తెలిపారు.