Telugu Global
Andhra Pradesh

ప్రభుత్వం సిగ్గుపడాలి.. తిరుమలలో రోజా ఘాటు విమర్శలు

పార్టీలు మారేవారికి గౌరవం దక్కదని చెప్పారు రోజా. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం సిగ్గుపడాలి.. తిరుమలలో రోజా ఘాటు విమర్శలు
X

ఏపీలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు, బాత్ రూమ్ లో హిడెన్ కెమెరాల వంటి ఘటనలు జరుగుతున్నాయని, నేరస్థులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమేనని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి రోజా. ఇలాంటి పరిస్థితులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. గతంలో దిశ యాప్ వంటి ఏర్పాట్ల ద్వారా ప్రభుత్వం నిందితుల్ని వెంటనే పట్టుకుని 24గంటల్లోనే శిక్షించిందని గుర్తు చేశారామె. జగనన్న పాలనలో ఇలాంటి ఘోరాలెప్పుడూ జరగలేదన్నారు. 9 ఏళ్ల బాలికను చంపేసి ముక్కలు ముక్కలుగా చేస్తే 60రోజులవుతున్నా అమ్మాయి శవాన్ని కనిపెట్టలేని దుస్థితి పోలీస్ యంత్రాంగానిదని మండిపడ్డారు రోజా. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారామె.

వైసీపీ అధికారంలో ఉండగా కనీసం నెలకోసారి అయినా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం రోజాకి ఆనవాయితీ. ఇటీవల కాలంలో ఆమె కాస్త గ్యాప్ తీసుకున్నారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారామె. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను ప్రస్తావించిన రోజా, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మదనపల్లెలో రెవెన్యూ ఫైల్స్ దగ్ధమైన ఘటనపై శ్రద్ధ పెట్టిన పోలీసులు, రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. కాలేజీ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తుంటే, అలాంటిదేమీ లేదని జిల్లా ఎస్పీ చెప్పడం సిగ్గుచేటన్నారు రోజా.

కొత్త ప్రభుత్వం వచ్చాక కాలేజీల్లో మళ్లీ ర్యాగింగ్ భూతం పెట్రేగిపోతోందన్నారు రోజా. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ తో ఓ విద్యార్థిని చంపేశారన్నారు. కలికిరి జేఎన్టీయూ కాలేజీలో ర్యాంగింగ్ తో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. రెడ్ బుక్ రాజ్యంగం పై పెట్టిన శ్రద్ధ, ఆడపిల్లలు, మహిళల రక్షణపై కూడా పెట్టాలని డిమాండ్ చేశారు.

పార్టీ ఫిరాయింపులపై కూడా రోజా స్పందించారు. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా లో కూడా ఇలానే చాలా మంది పార్టీ మారారని, వారివల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీలు మారేవారికి గౌరవం దక్కదని చెప్పారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా.

First Published:  31 Aug 2024 1:44 PM IST
Next Story