కాపుల ఓట్లు వేయించుకున్నారుగా.. రిజర్వేషన్లు ఇవ్వండి
కాపు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూటమి తన మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేస్తారో లేదో తెలియని సందర్భంలో రిజర్వేషన్లంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం విశేషం.
పవన్ కల్యాణ్ వల్ల కాపుల ఓట్లన్నీ కూటమికే పడ్డాయని, ఆ విధంగా కూటమి లాభపడిందని చెప్పారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్లు సాధించే బాధ్యత పవన్ కల్యాణ్ దే నని చెప్పారు. కాపు ఓట్లు వేయించుకున్నప్పుడు కాపులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు దాడిశెట్టి రాజా.
కేంద్ర ప్రభుత్వం కూడా కాపు రిజర్వేషన్ల పట్ల సానుకూలంగా ఉందని చెప్పారు దాడిశెట్టి రాజా. కేంద్రం సానుకూలంగా ఉన్నప్పుడే రాష్ట్రం ఆ పని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంతో మాట్లాడాలని సూచించారు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి రిజర్వేషన్లు ఇప్పించాలన్నారు. ఏ ప్రాతిపదికన కాపులకు రిజర్వేషన్లు ఇస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, అయితే కచ్చితంగా ఆ సామాజిక వర్గాన్ని మాత్రం బీసీల్లో చేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు రాజా.
కాపుల ఓట్లను పవన్ కూటమికి వేయించారు.
— YSRCP Brigade (@YSRCPBrigade) July 8, 2024
కాపులను బీసీల్లో చేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ దే.
- దాడిశెట్టి రాజా pic.twitter.com/NGz6Izt4D8
లాజిక్ మిస్ అవుతున్నారా..?
కాపు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూటమి తన మేనిఫెస్టోలో పెట్టలేదు. అసలు మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేస్తుందో లేదో తెలియని సందర్భంలో రిజర్వేషన్లంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేయడం విశేషం. పోనీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని దాడిశెట్టి రాజా అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నప్పుడు గతంలో కూడా కేంద్రంలో అదే కూటమి అధికారంలో ఉంది కదా, అప్పుడు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఏపీలో ప్రస్తుతం వైసీపీ నేతల నుంచి వినపడుతున్న ప్రతి డిమాండ్ కూడా గతంలో వారి పాలనలో వారు ఏం చేశారనే ప్రశ్నను తెరపైకి తెస్తోంది. నెలరోజుల ప్రభుత్వంపై అర్జంట్ గా విమర్శలతో విరుచుకుపడాలనే ఆలోచన పక్కనపెట్టి, టైమ్ తీసుకుని పక్కాగా పొలిటికల్ దాడి మొదలు పెడితేనే వైసీపీకి ప్రయోజనం ఉంటుంది.