Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే అయ్యాకే మీరు మంత్రి.. అనితకు వనిత కౌంటర్

హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు మహిళలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు మాజీ హోం మంత్రి తానేటి వనిత.

ఎమ్మెల్యే అయ్యాకే మీరు మంత్రి.. అనితకు వనిత కౌంటర్
X

మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనంటూ హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ నుంచి వరుస కౌంటర్లు పడుతున్నాయి. మాజీ హోం మంత్రి తానేటి వనిత, తాజా హోం మంత్రి అనిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంత్రి కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా ముందు ఎమ్మెల్యేగా గెలవాలి కదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కూడా కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనే విషయం గుర్తు పెట్టుకోవాలని, జగన్ ని పులివెందుల ఎమ్మెల్యే అంటూ వెటకారం చేయడం సరికాదని అన్నారు వనిత. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి అయ్యారని కౌంటర్ ఇచ్చారు వనిత.

మహిళలు తలదించుకునేలా..

హోం మంత్రి స్థానంలో ఉన్న వంగలపూడి అనిత వ్యాఖ్యలు మహిళలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు మాజీ హోం మంత్రి వనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, కానీ హోం మంత్రి మాత్రం పరిస్థితులు బాగానే ఉన్నాయని సమర్థించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు స్పందించడంలేదన్నారు వనిత. ఆమె మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

ఏపీలో పోలీస్ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి ఉందన్నారు వనిత. వారిని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలని సూచించారు. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతుంటే, చివరకు బాధితులపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితి మారాలన్నారు. హోం మంత్రి అనిత వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

First Published:  22 July 2024 2:22 AM GMT
Next Story