నాలాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా జగన్ ఆదరణ తగ్గదు
విజయసాయిరెడ్డి రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదం
పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వైసీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారు. రాజీనామా మాత్రమే కాదు.. రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. వైపీపీ 2019లో 151 స్థానాలు సాధించింది. 2024 ఎన్నికల్లో ఆపార్టీకి 40 శాతం ఓటింగ్ వచ్చింది. జగన్ అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. నాలాంటి వాళ్లు వెయ్యి మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గదనేది నా ఉద్దేశం. రాజీనామా నిర్ణయాన్ని లండన్ పర్యటనలో ఉన్న జగన్‌కు ఫోన్‌లో వివరించాను. వైసీపీకి 11 మంది బలం మాత్రమే ఉన్నది.నా రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే తప్ప.. వైసీపీ కాదన్నారు. పాత కేసుల విషయానికి వస్తే 2011 ఆగస్టు 10న ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఎన్నో ఆశలు చూపించి.. నన్ను అప్రూవర్‌గా మారాలని ఎంతో ఒత్తిడి చేశారు. దైవాన్ని నమ్మిన వ్యక్తిగా.. ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా అప్రూవర్‌గా మారడానికి నిరాకరించాను.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ సీపోర్ట్స్ కేసు పెట్టారు. నాకు లుకౌట్ నోటీసు ఇచ్చారు. ఏ2గా చేశారు. ఇంతవరకు నన్ను సీఐడీ వాళ్లు పిలవలేదు. ఈడీ పిలిచినప్పుడు వెంకన్న సాక్షిగా కేవీరావు అనే వ్యక్తితో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పాను. నాపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్పాను. కేవీ రావు చెప్పేది నిజమైతే ఆయన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పమనండి అని సవాల్ చేశారు. నేను నిజంగా విక్రాంత్‌రెడ్డిని ఆయన వద్దకు పంపించానన్న విషయంపై ప్రమాణం చేయమనండి. నాకు కాకినాడ సీ పోర్టు విషయంగా ఏరోజు నాకు ఎవరూ చెప్పలేదన్నారు. కేసు పెట్టిన తర్వాతే నాకు కూడా విషయాలన్నీ తెలిశాయన్నారు. విక్రాంత్‌రెడ్డితో నాకు పరిచయం చాలా తక్కువ. ఎక్కడైనా కనబడితే పలకరించేవాడిని. విక్రాంత్‌రెడ్డికి నాకన్న ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి కేవీ రావు అన్నారు. నాకు ఏ వ్యాపారాలు లేవు.. దేంట్లోనూ భాగస్వామిగా లేను. నేను పూర్తిగా పార్టీ కోసమే పనిచేశాను. కొన్ని పత్రికలు, ఛానళ్లలో కాకినాడ సీపోర్టు విషయంలోనే రాజీనామా చేసినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు
హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని, ఎవరైనా నేను అసత్యాలు చెప్పానంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తానను అన్నారు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు మూడు తరాలుగా నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ జీవితకాలంలో ఏ రోజూ ఆ కుటుంబంతో విభేదాలు రావన్నారు.