బాలినేనా మజాకా..! ఒంగోలులో ఈవీఎంల పరిశీలన
ఈవీఎంలు తయారు చేసిన భెల్ కంపెనీ ద్వారా వాటిపై వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోంది.
ఏపీలో ఎన్నికల తర్వాత చాలామంది ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. కానీ మాజీ మంత్రి బాలినేని మాత్రం ఓ పద్ధతి ప్రకారం ఎన్నికల కమిషన్ ని సంప్రదించారు. చివరకు తాను అనుకున్నది సాధించారు. ఒంగోలులో ఈనెల 19నుంచి 24 వరకు ఈవీఎంల పరిశీలన జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. డమ్మీ బ్యాలెట్ లతో ఈవీఎంలను పరిశీలిస్తారు.
ఈవీఎంల గోల్ మాల్ వల్ల ఏపీలో వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలినేని ఈసీకి ఫిర్యాదు చేయడంతోపాటు తమ అనుమానాలు నివృత్తి చేయాలని కోరారు. మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణకు రూ.5,66,400 ఫీజు కూడా చెల్లించారు. దీంతో ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై పడింది. ఈవీఎంలు తయారు చేసిన భెల్ కంపెనీ ద్వారా వాటిపై వచ్చిన అనుమానాలకు సమాధానం ఇప్పించాలని ఈసీ ప్రయత్నిస్తోంది.
రీకౌంటింగ్ కాదు..
ప్రస్తుతం జరిగేది రీకౌంటింగ్ కాదని, కేవలం డమ్మీ బ్యాలెట్ లతో ఈవీఎంల పరిశీలన అని చెబుతున్నారు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బెల్ కంపెనీ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్‌లు ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసిన వారికి చూపించబోతున్నట్టు ఆమె తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు.