Telugu Global
Andhra Pradesh

డ్రోన్‌ టెక్నాలజీనే భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌

మంగళగిరిలో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

డ్రోన్‌ టెక్నాలజీనే భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌
X

తాను 1995లో మొదటిసారి సీఎం అయ్యాక ఐటీ రంగంపై దృష్టి సారించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌-2024ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశాను. అప్పుడే ఐటీ అభివృద్ధి కోసం బెంగళూరుతో బాగా పోటీ పడ్డాం. అమెరికా వెళ్లి 15 రోజుల్లోనే అనేక సంస్థలను కలిశామన్నారు. ఆ రోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్‌సిటీని నిర్మించాం. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో ఇండియన్స్‌ చాలా సమర్థులని చంద్రబాబు చెప్పారు. విదేశాల్లో ఉన్న మన ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువాళ్లే. భవిష్యత్తులో మరిన్ని గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. నివాస అనుకూల నగరాల్లో దేశంలోనే హైదరాబాద్‌ బెస్ట్‌ సిటీ అన్నారు. డిజిటల్‌ కరెన్సీ లావాదేవీల్లో ప్రపంచంలో మనమే నెంబర్‌ వన్‌ అని, డేటా సాయంతో ఏఐ, ఎంఎల్‌ మరింత అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. ఇటీవల విజయవాడ వరదల్లో డ్రోన్లను వినియోగించి వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించినట్లు చెప్పారు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలక పాత్ర అన్నారు. నగరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు డ్రోన్లను వాడొచ్చు. భవిష్యత్తులో వైద్య రంగంలో పెనుమార్పులు రానున్నాయని, ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చు అన్నారు. కొని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతున్నాయని, తాము మాత్రం అభివృద్ధి కోసం డ్రోన్లు వినియోగిస్తామన్నారు. డ్రోన్‌ టెక్నాలజీ.. భవిష్యత్తులో గేమ్‌ ఛేంజర్‌ కానున్నదని సీఎం అన్నారు.

అంతకుముందు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అమరావతి డ్రోన్‌-సమ్మిట్‌ సీఎం ప్రారంభించారు. పౌర విమానాయాన శాఖ, డీఎఫ్‌ఐ, సీఐఐ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జాతీయస్థాయిలో ఈ సదస్సు జరగనున్నది. సదస్సులో తొమ్మిది ప్యానల్‌ డిస్కషన్లు, 50 స్టాళ్లలో డ్రోన్ల ప్రదర్శన, రాష్ట్ర ముసాయిదా డ్రోన్‌ పాలసీ పత్రం ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానానికి చేర్చడానికి ఈ సదస్సు తొలి అడుగుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సమ్మిట్‌కు రాష్ట్ర మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సంధారాణి హాజరయ్యారు. అలాగే 6,929 మంది ప్రతినిధులు పొల్గొన్నారు.

వచ్చే 20 ఏళ్లలో 200కు పైగా ఎయిర్‌పోర్టులు:కేంద్ర మంత్రి రామ్మోహన్‌

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఎప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తుంటారు. యువతతో పోటీ పడి చంద్రబాబు పని చేస్తుంటారు. నూతన సాంకేతిక వినియోగంపై చర్చలు జరుపుతుంటారు. దేశాభివృద్ధికి ఎప్పుడూ ఆలోచనలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత్‌ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయని చెప్పారు. 74 ఎయిర్‌ పోర్టుల నుంచి గత పదేళ్లలో 157 పెరిగాయన్నారు. వచ్చే 20 ఏళ్లలో 200కు పైగా ఎయిర్‌పోర్టులు వస్తాయని, విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

డ్రోన్ల తయారీ, వినియోగానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుందని పౌర విమాన యాన శాఖ కార్యదర్శి తెలిపారు. డ్రోన్‌ నిబంధనలను కేంద్రం సులభతరం చేసిందన్నారు. డ్రోన్‌ రంగంలో అంకురాలు, యువతను కేంద్రం ప్రోత్సహిస్తున్నది. డ్రోన్ల సమర్థ వినియోగానికి సలహాలు ఆహ్వానిస్టున్నామన్నారు.


First Published:  22 Oct 2024 1:04 PM IST
Next Story