మా కుటుంబాలను రోడ్డుపై పడేయకండి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
ప్రభుత్వం తమ ఉద్యోగాలు తొలగించి రోడ్డున పడేస్తుందని.. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబొరేటరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు. ఆదివారం మంగళగిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి ఈమేరకు వినతిపత్రాలు అందజేశారు. మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని, రాజకీయ ఒత్తిళ్లతో తమ ఉద్యోగాలు తీసేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, ఇతర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన టి. సుజన కుమారి తన గోడు పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నారు. పుట్టుకతోనే తనకు ఒక కిడ్నీ లేదని, బరువులు ఎత్తే పని చేయలేనని, మూడు నెలల క్రితం కమలాపూరం ల్యాబ్ నుంచి తన ఉద్యోగం తొలగించారని తెలిపారు. తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ఉద్యోగం గురించి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.