Telugu Global
Andhra Pradesh

చంద్రగిరి పీఎస్‌లో మంచు మనోజ్‌ ఫిర్యాదు

శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మనోజ్‌కు సూచించిన పోలీసులు

చంద్రగిరి పీఎస్‌లో మంచు మనోజ్‌ ఫిర్యాదు
X

మంచు కుటంబంలో చెలరేగిన వివాదం ఇంకా సమసిపోలేదు. తాజాగా సినీ నటుడు మంచు మనోజ్‌, మౌనిక దంపతులు చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బుధవారం మోహన్‌బాబు వర్సిటీలో జరిగిన ఘటనపై మనోజ్‌ రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనపై, మౌనికపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని అందులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మనోజ్‌కు పోలీసులు సూచించారు.

కుటుంబ కలహాలతో మోహన్‌బాబు కుటుంబం కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ కుటుంబ పెద్దలకు నివాళలు అర్పించడానికి బుధవారం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్‌ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొన్నది. మనోజ్‌ లోపలికి వెళ్లడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మా తాత, నాయనమ్మ సమాధులను చూడటానికి ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్‌ ఉన్నందున వర్సిటీలోకి వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అనంతరం మనోజ్‌ దంపతులు బందోబస్తు మధ్య తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మనోజ్‌, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

మరోవైపు పోలీస్‌ స్టేషన్‌ వద్ద మనోజ్‌ ప్రెస్‌మీట్‌ లో మాట్లాడుతుండగా ఉన్నట్లుండి కడుపునొప్పి రావడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో మనోజ్‌కు ధైర్యం చెబుతూ మౌనిక కన్నీటి పర్వంతమయ్యారు.

First Published:  16 Jan 2025 1:24 PM IST
Next Story