Telugu Global
Andhra Pradesh

సెంచరీ హీరో నితీశ్‌కు చంద్రబాబు విషెస్‌

ఆసీస్‌ గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించడం సంతోషం కలిగిస్తున్నదన్న ఏపీ సీఎం

సెంచరీ హీరో నితీశ్‌కు చంద్రబాబు విషెస్‌
X

ఏపీకి చెందిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. మెల్‌బోర్న్‌ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా క్లిష్టపరిస్థితుల్లో సెంచరీ చేసిన నితీశ్‌పై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో నితీశ్‌ సెంచరీ సాధించాడు. విశాఖపట్నం యువకుడు శతకం చేయడం అభినందనీయం. ఆసీస్‌ గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించడం సంతోషం కలిగిస్తున్నది. రంజీలోనూ ఆంధ్రా తరఫున ఎన్నో విజయాలు సాధించాడు. అండర్‌-16 నుంచే అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని.. భారత జట్టులో కొనసాగి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేయానలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చంద్రబాబు పోస్టు పెట్టారు.

విశాఖ కుర్రాడు నితీశ్‌ ఆసీస్‌పై సెంచరీ చేయడం చూసి ఆనందించా. తీవ్ర ఒత్తిడిలోనూ ఏకాగ్రతను కోల్పోకుండా తొలి శతకం పూర్తి చేసినందుకు అభినందనలు. నితీశ్‌ ఆటపై గర్వంగా ఉన్నది. ఇలానే మున్ముందూ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఈ సంవత్సరం గుర్తిండిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు.. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక్కో అడగు ముందుకేస్తూ స్వర్ణాంధ్ర దిశగా సాగిపోదాం అని నారా లోకేశ్‌ పోస్టు చేశారు.

సచిన్‌, పంత్‌ తర్వాత..

ఆస్ట్రేలియాలో అతి పిన్న వయస్సులో సెంచరీ సాధించిన మూడో బ్యాటర్‌గా నితీశ్‌ నిలిచాడు. 1992 లో సచిన్‌ టెండూల్కర్‌ (18 ఏళ్ల 256 రోజులు), 2019 రిషబ్‌ పంత్‌ (21 ఏళ్ల 92 రోజులు), సెంచరీ సాధించి ముందున్నారు. ఇప్పుడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి 21 ఏళ్ల 216 రోజుల వయసులో మెల్‌బోర్న్‌ వేదిగా సెంచరీ సాధించాడు.

ఏసీఏ రూ. 25 లక్షల నగదు బహుమతి

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తరఫున యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ రూ. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు సెలక్ట్‌ అయిన నితీశ్‌కు అభినందనలు తెలిపారు. తర్వలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుతిని అందిస్తామన్నారు.

First Published:  28 Dec 2024 2:43 PM IST
Next Story