Telugu Global
Andhra Pradesh

ఇవ్వాలనుకున్నా.. ఇవ్వలేకపోతున్నా

వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలపై ఈపాటికే సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ అంటూ.. మిగతా వాటిని పక్కనపెట్టేశారు.

ఇవ్వాలనుకున్నా.. ఇవ్వలేకపోతున్నా
X

ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగాలు వింటుంటే ఎక్కడో తేడా కొడుతోందనే అనుమానం కలగక మానదు. ఆయన ఎక్కడకు వెళ్లినా ముందుగా ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు. తాను అన్నీ చేయాలనుకుంటున్నాను, కానీ ఏమీ చేయలేకపోతున్నానని చెప్పుకొస్తున్నారు. తాజాగా చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగం మరోసారి ప్రజల్ని షాక్ కి గురి చేసింది.


"ఈ రోజు మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. నేను చాలా ఆశగా వచ్చా, అడిగినవన్నీ ఇవ్వాలని. అడిగిన వాటికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం. కానీ రెండు నెలలుగా ప్రభుత్వాన్ని చూస్తున్నా. అన్ని శాఖల్ని సమీక్ష చేస్తున్నా. ఖజానా దివాళా తీసింది. మామూలుగా కాదు. 10లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ, అసలు కట్టాలంటే సంవత్సరానికి 80నుంచి 90వేల కోట్ల రూపాయలు కట్టాలి. మనకొచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోదు, పెను సవాళ్లు ముందున్నాయి." అని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలపై ఈపాటికే సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ అంటూ.. మిగతా వాటిని పక్కనపెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున అధికారికంగా ఎవరూ సూపర్ సిక్స్ మాటెత్తడం లేదు. కనీసం ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కూడా మొదలు కాలేదు. ఆ ప్రయాణం గురించి సాక్షాత్తూ రవాణా శాఖ మంత్రి కూడా ట్వీట్ వేసి డిలీట్ చేస్తుంటారు కానీ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలు సభల్లో సీఎం చంద్రబాబు ప్రసంగాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఖజానా ఖాళీ అంటూ ఆయన ప్రజల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అలవికాని హమీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

First Published:  8 Aug 2024 3:28 AM GMT
Next Story