శ్వేతపత్రం వాయిదా.. చంద్రబాబు వెనక్కి తగ్గారా..?
శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రం విడుదలకు ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు. అందుకే వాయిదా వేశారు.
గత ప్రభుత్వ పాలనపై ఏపీలో వరుసగా శ్వేతపత్రాలు విడుదలవుతున్నాయి. ఈ శ్వేతపత్రాల ద్వారా గత పాలనపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేరుగా సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. శ్వేతపత్రం విడుదల వాయిదా వేశారు.
వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా కత్తితో నరికి చంపాడు ప్రత్యర్థి. ఇదీ రాజకీయ దాడి అని వైసీపీ అంటోంది, కాదు వ్యక్తిగత దాడి అని టీడీపీ కవర్ చేస్తోంది. ఈ రెండిట్లో ఏది నిజమైనా.. ఏపీలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి టైమ్ లో గత ప్రభుత్వాన్ని తిడుతూ శ్వేతపత్రం అంటే అది సాహసమనే చెప్పాలి. అందుకే చంద్రబాబు ఈ రిస్క్ తీసుకోలేదు. శ్వేతపత్రం కూటమి ప్రభుత్వంపైకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండటంతో ఆయన వెనకడుగు వేశారు.
రషీద్ ఘటనతోపాటు, పుంగనూరులో రాళ్లదాడి కూడా సంచలనంగా మారింది. ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లదాడి చేసుకోగా.. ఇరు పార్టీలు మీడియా, సోషల్ మీడియాలో మాటల దాడి చేసుకున్నాయి. తప్పు మీదంటే మీదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు నేతలు. ఈ ఘటన కూడా శ్వేతపత్రం విడుదలకు అడ్డుపడింది.
వాస్తవానికి శ్వేతపత్రంలో గత ప్రభుత్వ తప్పుల్ని ఎంచిచూపుతారు. కానీ ప్రస్తుతం కూడా అవే పరిస్థితులు ఉన్నాయి కదా, మరి వీటి సంగతేంటి..? అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. అందులోనూ కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ ప్రాంతాల్లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయి. ఆస్తుల విధ్వంసం, వ్యక్తిగత దాడులు కూడా ఎక్కువయ్యాయి. శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రం విడుదలకు ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు. అందుకే వాయిదా వేశారు.