Telugu Global
Andhra Pradesh

ఇక సుత్తి కొట్టను..!

తనతో ఏ మీటింగ్ కూడా గంటకంటే ఎక్కువ ఉండదన్నారు చంద్రబాబు. సుత్తికొట్టను, సూటిగా పాయింట్ కొచ్చేస్తానంటూ అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారు.

ఇక సుత్తి కొట్టను..!
X

చంద్రబాబుతో రివ్యూ మీటింగ్ అంటే ఓ పట్టాన వదలరు అనేది ఇప్పటి వరకూ ఉన్న అపవాదు. బాబు ఛాంబర్ లోకి వెళ్తే, ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదని అంటారు. గంటల తరబడి సమీక్షలు, సమావేశాలకు చంద్రబాబు పెట్టింది పేరు. వీడియో కాన్ఫరెన్స్ అయినా, ఆడియో కాన్ఫరెన్స్ అయినా సుదీర్ఘంగా సాగుతుంటాయి. ఇకపై అలా సమయం వృథా చేయనని తానే స్వయంగా చెప్పారు సీఎం చంద్రబాబు. సుత్తికొట్టను, సూటిగా పాయింట్ కొచ్చేస్తానంటూ అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారు. ఏ మీటింగ్ నీ గంటకంటే ఎక్కువ కొనసాగించబోనన్నారు చంద్రబాబు.


తాను మారిన మనిషిని అని చెప్పుకోడానికి ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంత్రులు, అధికారుల విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఆయన ఇదే చెప్పారు. తాను పూర్తిగా మారిపోయానని, ఇకపై తనను కొత్తగా చూస్తారని, 1995లో ఎలా ఉన్నానో అలాంటి వింటేజ్ చంద్రబాబుని చూస్తారంటూ అధికారులకు చెప్పారాయన. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. సమస్యల్ని తీసుకుని పరిష్కారం కోసం తన వద్దకు రావొద్దని, ఒకటి రెండు పరిష్కారాలు ఆలోచించి వాటిని తన ముందుకు తీసుకు రావాలన్నారు. ఇది వరకు తాను మాత్రమే పరిగెత్తేవాడినని, ఇప్పుడు మంత్రులు, అధికారులు కూడా పరుగులు పెట్టాలని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు.

మొహమాటాలకు తావులేదు..

గతంలో ఉన్న అధికారుల్ని వీలైనంత వరకు మార్చేశామని, ఎవరు ఎక్కడ సరిపోతారని భావిస్తున్నామో వారినే అక్కడ నియమించామని వివరించారు సీఎం చంద్రబాబు. గతంలో అధికారులకు ఒకటి రెండు ఛాన్స్ లు ఇచ్చేవాడినని, సరిగా పనిచేయకపోయినా సర్దుకుపోయేవాడినని.. ఈసారి అలా కాదని అన్నారాయన. ఏ అధికారికయినా ఒకటే ఛాన్స్ అని తేల్చి చెప్పారు. ఆ ఛాన్స్ వినియోగించుకోకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్నారు. మంత్రులు, వివిధ శాఖల సెక్రటరీలు, సెక్షన్ ఇన్ చార్జ్ లతో సచివాలయంలో సమావేశమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న తీరు, ప్రాధాన్యతలను వివరించారు. పనులు చేయడానికి డబ్బులు లేవని సమాధానం చెప్పొద్దని, నిధులులేకుండానే చేసే పనులు చాలా ఉంటాయని, వాటిపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు ఉపదేశించడం కొసమెరుపు.

First Published:  25 July 2024 6:58 AM IST
Next Story