హస్తినకు సీఎం చంద్రబాబు
ప్రధాని సహా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని, సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమౌతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో మంగళవారం భేటీ కానున్నారు.
బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి. రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశం ఉన్నది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్ అయ్యింది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే వ్యవహారంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఈ అంశంపై సీఎం నేరుగా మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించింది. అంతేకాదు అంతేకాదు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాన్నది. ఈ అంశాన్ని రాజకీయాల్లోకి లాగొద్దన్న సుప్రీం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ వ్యాఖ్యానించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను సీఎం చంద్రబాబు స్వాగతించారు. అయినా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్వవహారంలో సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది.