Telugu Global
Andhra Pradesh

100రోజుల టార్గెట్.. ఆలోగా సీఎం చంద్రబాబు ఏం చేస్తారంటే..?

ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

100రోజుల టార్గెట్.. ఆలోగా సీఎం చంద్రబాబు ఏం చేస్తారంటే..?
X

సీఎం చంద్రబాబు 100 రోజుల టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆలోగా సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెప్పలేదు కానీ.. పాలన గాడిలో పెడతానని అన్నారు. పాలన గాడిలో అంటే దానికి కొలమానం ఏంటి..? ఎవరు పాలన గాడిలో పడిందని సర్టిఫై చేస్తారు..? పోనీ ఎలా చెబుతారు..? ఈ లెక్కలేవీ లేవు కాబట్టి 100 రోజుల డెడ్ లైన్ అని ఈజీగా ఆయన అనేశారని వైసీపీ అప్పుడే విమర్శలు మొదలు పెట్టింది. పాలన గాడిలో పెట్టడం సంగతి తర్వాత, ముందు సూపర్ సిక్స్ గురించి చెప్పండని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు.

ఈరోజు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు చంద్రబాబు. ఆ ఫిర్యాదులన్నిటినీ పరిష్కరించడమే తన తక్షణ కర్తవ్యం అని చెప్పారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలపైనే ప్రజలు ఫిర్యాదులు చేశారన్నారు. వారిని కష్టాలపాలు చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూలో రికార్డులన్నీ తారుమారు చేశారని, దీనికి ముఖ్య కారణం వైసీపీ నేతలేనన్నారు చంద్రబాబు. మదనపల్లెలో ఏకంగా ఆఫీస్ నే తగలబెట్టారని ఆరోపించారు.

ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతామని, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సమస్యలను విభాగాల వారీగా విభజించి పరిష్కరిస్తామన్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వినతిపత్రాలు స్వీకరిస్తామన్నారు చంద్రబాబు. గతంలో కూడా వినతిపత్రాల స్వీకరణ ఉండేది. ప్రతి సోమవారం స్పందన పేరుతో అధికారులు ప్రజల నుంచి అర్జీలు తీసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలనుకుంటోంది. వినతిపత్రాల స్వీకరణ కూడా సూపర్ సిక్స్ నుంచి దృష్టి మరల్చే కార్యక్రమమేనంటోంది ప్రతిపక్ష వైసీపీ.

First Published:  3 Aug 2024 7:45 PM IST
Next Story