Telugu Global
Andhra Pradesh

100 కేసులు పెట్టినా, బుల్లెట్లతో కాల్చినా తగ్గేది లేదు

తనపై ఇది మొదటి కేసు అని, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు మోహిత్ రెడ్డి. బుల్లెట్లతో కాల్చినా వెనక్కి తగ్గను అని చెప్పారు.

100 కేసులు పెట్టినా, బుల్లెట్లతో కాల్చినా తగ్గేది లేదు
X

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు మోహిత్ రెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు స్టేషన్ కి తీసుకొచ్చి నోటీసు ఇచ్చి పంపించారు. తనను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, అకారణంగా తనకు నోటీసులిచ్చారని అంటున్నారు మోహిత్ రెడ్డి. పోలీసులు పిలిస్తే తానే వచ్చేవాడిని కదా అన్నారు. స్నేహితుడి పెళ్లికోసం విదేశాలకు వెళ్తున్న క్రమంలో అడ్డుకున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులకు భయపడేవాడిని కాదని తేల్చి చెప్పారు మోహిత్ రెడ్డి.

తనపై ఇది మొదటి కేసు అని, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు మోహిత్ రెడ్డి. బుల్లెట్లతో కాల్చినా వెనక్కి తగ్గను అని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్లు వచ్చాయని చెప్పారు మోహిత్ రెడ్డి. అదేమీ పులివర్తి నాని జాగీర్ కాదన్నారు. వారి అక్రమాలను తాను అడ్డుకుంటూనే ఉంటానన్నారు. తన తండ్రి నిజాయితీగా రాజకీయం చేయడం నేర్పారని, కేసులు పెట్టారని వెనక్కి వెళ్లే రకం తాను కాదన్నారు మోహిత్ రెడ్డి. తమను రాజకీయంగా సమాధి చేస్తామని పులివర్తి నాని అంటున్నారని, తమను సమాధి చేయొచ్చేమో కానీ, రాజకీయంగా సమాధి చేయడం సాధ్యం కాదని హెచ్చరించారు.


ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. విదేశాల్లో చదివిన తన కొడుకుని వీధి పోరాటాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు భాస్కర్ రెడ్డి. తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడినని, తనను మించి తన కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేస్తారన్నారు. ఆ పోరాటాలు ఎలా ఉంటాయో ఈప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తామన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.



First Published:  28 July 2024 12:00 PM IST
Next Story