సోదరుడికి చంద్రబాబు నివాళులు
రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు
గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోదరుడు మృతిచెందాడనే విషయం తెలుసుకొని మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు చేరుకొని సోదరుడి పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు తనయులు హీరో రోహిత్, గిరీశ్ ను చంద్రబాబు ఓదార్చారు. ఆయన వెంట సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సహా ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకొని లోకేశ్ శనివారం ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి వరకు హాస్పిటల్ లోనే ఉన్న చంద్రబాబు, లోకేశ్ అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని తమ నివాసానికి బయల్దేరారు. రాత్రికి హైదరాబాద్ లోని నివాసంలో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని నారావారిపల్లెకు తరలిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో చంద్రబాబు, లోకేశ్ సహా ఇతర కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు వెళ్తారు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహిస్తారు.