Telugu Global
Andhra Pradesh

మద్యం రేట్లు పెరిగినా రాష్ట్రానికి ఆదాయం తగ్గింది.. ఎందుకంటే..?

ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు. సరైన పాలసీ తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూస్తామన్నారు.

మద్యం రేట్లు పెరిగినా రాష్ట్రానికి ఆదాయం తగ్గింది.. ఎందుకంటే..?
X

ఏపీ అసెంబ్లీలో ఈరోజు మద్యం విధానంపై శ్వేతపత్రం విడుదలైంది. స్లైడ్ షో ద్వారా గతంలో ఏం జరిగింది..? ఎలా జరిగింది..? అనే విషయాలను సీఎం చంద్రబాబు వివరించారు. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని అన్నారాయన. లోతైన విచారణకోసం ఈడీకీ సిఫార్సు చేస్తామని కూడా తెలిపారు. నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయం అవుతాయన్నారు చంద్రబాబు. శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తేటతెల్లమవుతుందన్నారు.


ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, దాన్ని పక్కనపెట్టారని, ఆ తర్వాత లిక్కర్‌ ఔట్‌లెట్స్‌ తగ్గిస్తామని చెప్పి మరోసారి ప్రజల్ని మోసం చేశారని అన్నారు సీఎం చంద్రబాబు. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని చెప్పి మరీ మోసం చేశారన్నారు. పొరుగురాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారన్నారు. ధరలు పెంచినా మద్యం వినియోగం తగ్గలేదని గుర్తు చేశారు. ఇక్కడ మరో వింత జరిగిందని, రేట్లు పెంచి మద్యం అమ్మినా రాష్ట్ర ఖజానాకు మాత్రం ఆదాయం సమకూరలేదన్నారు. ఆ ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని విమర్శించారు. దేశంలోనే టాప్ 5 మద్యం బ్రాండ్లను ఏపీనుంచి తరిమేశారని, లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారని అన్నారు చంద్రబాబు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బు తీసుకొచ్చి ఎక్సైజ్‌ శాఖలో పెట్టుబడి పెట్టించారని, దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు.

ఎక్సైజ్‌ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు. సరైన పాలసీ తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూస్తామనని, అదే సమయంలో డీఅడిక్షన్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం పాలసీ విషయంలో శాసనసభ్యుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు చంద్రబాబు.

First Published:  24 July 2024 5:15 PM IST
Next Story