Telugu Global
Andhra Pradesh

ఆ పని చేయాల్సి వస్తే నేనే ముందుండాలి

ఏపీలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే శిక్షిద్దామని చెప్పారు.

ఆ పని చేయాల్సి వస్తే నేనే ముందుండాలి
X

టీడీపీ నేతలు కక్షసాధింపులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు సీఎం చంద్రబాబు. నిజంగానే కక్షసాధించాలంటే తానే ముందుండి ఆ పని మొదలు పెట్టాలని అన్నారు. అక్రమ కేసులు పెట్టి తనను 53 రోజులు జైలులో పెట్టారని, ఆ బాధను తాను భరించానే కానీ, ఏనాడూ కక్ష సాధించాలనుకోలేదని వివరించారు. ప్రజలు తమను అందుకోసం గెలిపించలేదన్నారు. అసెంబ్లీ తొలిరోజు సమావేశాల అనంతరం కూటమి నేతలతో మాట్లాడిన ఆయన ఏపీలో శాంతి భద్రతల అంశంపై స్పందించారు.


ఏపీలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు చంద్రబాబు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే శిక్షిద్దామని అన్నారు. గతంలో వివేకా హత్య కేసులో జగన్ నాటకాలాడారని, ఇప్పుడు వినుకొండ ఘటనలో కూడా అలాంటి నాటకాలే మొదలు పెట్టారన్నారు. తప్పులు చేయడం, వాటిని పక్కవారిపైకి నెట్టడం జగన్ కు అలవాటు అంటూ విమర్శించారు చంద్రబాబు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే అప్పుడే తప్పులు జరిగిపోయాయంటే ఎలా అని ప్రశ్నించారు.

గవర్నర్‌ ప్రసంగాన్ని తొలిరోజే అడ్డుకోవడం సరైన పనేనా? అని ప్రశ్నించారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తొలి 10 నిమిషాల్లోనే వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారని గవర్నర్ కి ఇచ్చే గౌరవం అదేనా అన్నారు. కూటమిలో మూడు పార్టీల సభ్యులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు చంద్రబాబు.

First Published:  22 July 2024 10:07 AM GMT
Next Story