Telugu Global
Andhra Pradesh

అవును అది అప్పే.. తీర్చేది 30 ఏళ్ల తర్వాతే

అప్పు తీసుకున్నా అది తిరిగి తీర్చేది 30 ఏళ్ల తర్వాతేనని చెప్పారు చంద్రబాబు. ఆ సమయానికి అది అంత భారంగా ఉండదని అన్నారు.

అవును అది అప్పే.. తీర్చేది 30 ఏళ్ల తర్వాతే
X

అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చేది ఆర్థిక సాయమా, లేక కేవలం అప్పు మాత్రమేనా అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధానికి 15వేల కోట్ల కేటాయింపు అంటూ ముందు హడావిడి జరిగింది. ఆ తర్వాత, అది వరల్డ్ బ్యాంక్ అప్పు, కేంద్రం కేవలం దానికి హామీగా ఉంటుందనే విషయం తెలిసే సరికి ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. చివరిగా సీఎం చంద్రబాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు. అవును అది వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొచ్చే రుణమేనని అన్నారు.

కేంద్ర బడ్జెట్‌ రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేసేదిగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రతిపాదనలు చాలా వరకు ఆమోదం పొందాయన్నారు. వివిధ ఏజన్సీల ద్వారా రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో కొంత అప్పుగానే పరిగణించాల్సి ఉన్నా.. ఆ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆ అప్పుని తిరిగి తీర్చేది 30 ఏళ్ల తర్వాతేనని చెప్పారు. ఆ సమయానికి అది అంత భారంగా ఉండదని అన్నారు. కేంద్రం నుంచి కొంత గ్రాంట్ వస్తుందని, మరికొంత కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుందని.. ఏ రూపంలో వచ్చినా అది రాష్ట్రానికి, రాజధానికి ఉపయోగ పడుతుందన్నారు సీఎం చంద్రబాబు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. నిధుల కేటాయింపుని బడ్జెట్ లో పెట్టకపోయినా.. ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత తమదేనని కేంద్రం ప్రకటించిందని, అది మనకు చాలు కదా అని అన్నారు. ఇక వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ లాగా ఉంటుందని కూడా చెప్పారు. ఆ ప్యాకేజీ నిధులు, రాయితీలు రాష్ట్రానికి ఉపయోగకరం అన్నారు చంద్రబాబు.

First Published:  24 July 2024 8:13 AM IST
Next Story