తిరుమల అన్నప్రసాదంలో జెర్రి
కంగుతిన్న భక్తులు.. ఆకులో జెర్రి వచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేసిన అధికారులు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న శుభ తరుణాన శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రి వచ్చింది. ఆ అన్నప్రసాదం తింటున్న భక్తులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు శనివారం మాధవ నిలయంలోని అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. భోజనం చేస్తున్న క్రమంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రి కనిపించింది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని భక్తులు తెలిపారు. తాము అన్న ప్రసాద కేంద్రంలో వీడియో రికార్డింగ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అధికారులు వచ్చి వీడియో తీయవద్దని కోరారని, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన వ్యక్తికి చెవులు సరిగా వినిపించవచ్చని తమకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. అన్నప్రసాదంలో జెర్రి లేదని, ఆకులో వచ్చి ఉండొచ్చని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆ భోజనం చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యేదని, అలా జరిగితే ఎవరిది బాధ్యత అని భక్తులు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించగా, కల్తీగా నిర్దారణ అయిన నెయ్యి లడ్డూ తయారీకి వాడలేదని టీటీడీ ఈవో వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై సుప్రీం కోర్టు ఇండిపెండెంట్ సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. ఆ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే అన్నప్రసాదంలో జెర్రి కనిపించడం కలకలం సృష్టించింది. సిబ్బంది బాధ్యతయూతంగా నడుచుకోవాలని ఏపీ సీఎం శనివారం ఉదయమే ఆదేశించారు.. కొన్ని గంటల్లోనే సిబ్బంది భక్తులతో దురుసుగా ప్రవర్తించారు.