Telugu Global
Andhra Pradesh

పిన్నెల్లికి బెయిల్.. కానీ..!

మాచర్ల నుంచి పిన్నెల్లి అనుచరులతోపాటు, నరసరావుపేట నుంచి ప్రత్యేకంగా పోలీసు అధికారులు కూడా నెల్లూరు జైలు వద్దకు వచ్చారు. వారు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పిన్నెల్లికి బెయిల్.. కానీ..!
X

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హత్యాయత్నం కేసుల్లో హైకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. విడుదలకు టైమ్ అయిపోయిందని, ఈరోజు ఆయన్ను అధికారులు రిలీజ్ చేయలేదు. దీంతో ఆయన కోసం జైలు వద్దకు వచ్చిన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక పిన్నెల్లిపై వరుస కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ పై దాడి చేసి ఈవీఎం ధ్వంసం చేశారనేది అందులో ప్రధాన ఆరోపణ. అయితే ఆ కేసులో ఆయనకు కోర్టు ఇదివరకే బెయిల్ ఇచ్చింది. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారని, పోలింగ్‌ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేశారని పోలీసులు వేర్వేరుగా కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇప్పుడు బెయిల్ రావడంతో పిన్నెల్లి విడుదల కావాల్సి ఉంది.

రేపేంటి..?

అన్నీ అనుకున్నట్టు జరిగితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రేపు జైలు నుంచి విడుదలవుతారు. మాచర్ల నుంచి పిన్నెల్లి అనుచరులతోపాటు, నరసరావుపేట నుంచి ప్రత్యేకంగా పోలీసు అధికారులు కూడా నెల్లూరు జైలు వద్దకు వచ్చారు. వారు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇతర పోలీసులు కూడా నెల్లూరు వచ్చి మకాం వేయడంతో ఏదో జరుగుతోందో అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇతర కేసుల్లో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిన్నెల్లిపై మరికొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయని సమాచారం. ఆ కేసుల్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది. అదే జరిగితే బెయిలొచ్చినా పిన్నెల్లి తిరిగి కొత్త కేసుల్లో రిమాండ్ కి వెళ్లాల్సి ఉంటుంది.

First Published:  23 Aug 2024 8:10 PM IST
Next Story