Telugu Global
Andhra Pradesh

సబ్సిడీపై సరుకులు.. కూటమి కొత్త వ్యూహం

రాష్ట్రంలోని రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం అమ్మకాలు మొదలు పెడతామన్నారు మంత్రి నాదెండ్ల.

సబ్సిడీపై సరుకులు.. కూటమి కొత్త వ్యూహం
X

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. దీనికి కారణం కేంద్రమా, రాష్ట్రమా అనే తర్కం పక్కనపెడితే అసలు తాము ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వం ఏం చేస్తుందనేదే ప్రజలు వేసే తొలి ప్రశ్న. ఆ మాటకొస్తే కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి.. వారిపై వీరిపై నిందలు వేసే అవకాశం అధికారపక్షానికి అస్సలు లేదు, గత ప్రభుత్వంపై తప్పునెట్టే ఛాన్స్ ఏమాత్రం లేదు. ఈ క్రమంలో కూటమి నష్టనివారణ చర్యలు చేపడుతోంది. రైతుబజార్లలో సబ్సిడీపై సరుకులు అమ్మేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.


రాష్ట్రంలోని రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం అమ్మకాలు మొదలు పెడతామన్నారు మంత్రి నాదెండ్ల. గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించి విక్రయాలు జరుపుతామన్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కేజీ రూ.181 ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసే కౌంటర్లో రూ.160కే అందిస్తారు. బియ్యం కేజీ రూ.52.40 కాగా రైతు బజార్ రేటు రూ.48 మాత్రమే. కేజీ రూ.55.85 ఉన్న స్టీమ్డ్ బియ్యాన్ని రూ.49 కి విక్రయిస్తారు. రైతు బజార్లలోని ప్రత్యేక కౌంటర్లలో వీటిని అమ్ముతారు.

గతంలో ఉల్లిపాయలు, టమోటాల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇలా ప్రత్యేక కౌంటర్లు తెరిచి ప్రజలకు తక్కువ ధరకే వాటిని అందించే ప్రయత్నం చేసింది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసరాలను కూడా తక్కువ ధరకు అందిస్తే ప్రజలు కచ్చితంగా హర్షిస్తారు. అయితే ఇది ఒకరోజు హడావిడిలా కాకుండా నిత్యం ప్రజలకు ఈ కౌంటర్లు అందుబాటులో ఉండి, నాణ్యతలో రాజీపడకుండా ఉంటే మాత్రం కూటమి ప్రభుత్వం మార్పు తెచ్చిందనే నమ్మకం ప్రజలకు కలుగుతుంది.

First Published:  9 July 2024 9:17 AM IST
Next Story