Telugu Global
Andhra Pradesh

సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్.. పెన్షన్ల పంపిణీకి డెడ్ లైన్

ఆగస్ట్-1 వతేదీ ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆరోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని డెడ్ లైన్ పెట్టారు.

సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్.. పెన్షన్ల పంపిణీకి డెడ్ లైన్
X

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగానే సాగింది. వాలంటీర్ల అవసరం లేకుండానే కేవలం సచివాలయ సిబ్బందితోనే పని పూర్తి చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. రెండో నెలకూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఈసారి కూడా వాలంటీర్లు లేకుండానే సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొత్తగా డెడ్ లైన్ విధించింది. ఆగస్ట్-1 వతేదీ ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆరోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని డెడ్ లైన్ పెట్టారు. సమస్యలున్నచోట ఆ తర్వాతి రోజు 100 శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు. గత నెలలో మంగళగిరి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఈసారి మడకశిర నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. టీడీపీ నేతలు కూడా తమకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీకి హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు.

గతంలో వాలంటీర్లు ఉదయాన్నే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. మిగతా రోజుల్లో పెద్దగా పనులేవీ ఉండవు కాబట్టి, ఒకటో తేదీ ఒక్కరోజు వారు ఠంచనుగా ఉదయం 5 గంటలకే పని మొదలు పెట్టేవారు. కానీ సచివాలయ ఉద్యోగులకు ఇది కొత్త డ్యూటీ. వారు నెలంతా పనిచేయాలి, ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ వారికి అదనపు భారంగా మారింది. అది కూడా ఉదయం 6 గంటల్లోపు పంపిణీ పూర్తి చేయాలంటే కాస్త కష్టమే. గతంలో పెద్దగా పనిభారం లేని ఉద్యోగులందరికీ ఈ డ్యూటీ వేస్తున్నారు. అక్కడక్కడ ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా ఈ పని కేటాయిస్తున్నారు. దీంతో వారంతా పెన్షన్ల పంపిణీని భారంగా భావిస్తున్నారు.

వాలంటీర్ల సంగతేంటి..?

అధకారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం రూ.10వేలు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక మాత్రం వరుసగా రెండు నెలలు వారితో పనిలేకుండానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అంటే వాలంటీర్లు లేకుండానే అన్ని పనులు జరుగుతాయి అని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వాలంటీర్ల భవిష్యత్ ఏంటో తేలాల్సి ఉంది. ఆగస్ట్-1 పెన్షన్ల పంపిణీకి కూడా సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయడంతో వాలంటీర్లు టెన్షన్ పడుతున్నారు. వైసీపీ కోసం రాజీనామాలు చేసిన వారిలో ఆ ఆందోళన మరింత ఎక్కువ. ఇప్పటికే కొందరు మిగతా ఉపాధి మార్గాలు చూసుకున్నారు. మిగిలినవారు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

First Published:  30 July 2024 5:51 AM GMT
Next Story