Telugu Global
Andhra Pradesh

జీపీఎస్ ఆగిపోయింది.. ఉద్యోగులు హ్యాపీయేనా..?

ఉద్యోగులు ప్రస్తుతానికి హ్యాపీయే.. అయితే సీపీఎస్ పూర్తిగా రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) తేవాలని అంటున్నారు.

జీపీఎస్ ఆగిపోయింది.. ఉద్యోగులు హ్యాపీయేనా..?
X

అధికారంలో ఉన్నప్పుడు జగన్ అమలు చేయని హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఒకటి. ఉద్యోగులు వద్దంటున్నా కూడా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తెచ్చారు, పైగా అదే వారికి ఎక్కువ మేలు చేకూరుస్తుందని అన్నారు. జీపీఎస్ విషయంలో వైసీపీపై ఉద్యోగుల కోపం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. సీపీఎస్ రద్దు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల వేళ టీడీపీ, జనసేన విడివిడిగా హామీలిచ్చింది. ఈ క్రమంలో తాజాగా జీపీఎస్ జీఓ గెజిట్ ని నిలిపివేసింది కూటమి ప్రభుత్వం. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ సెలవుపై వెళ్తూ వెళ్తూ జీపీఎస్ ఫైల్ కి ఆమోదం తెలిపారని, ఆయన ఆదేశాలతో జూన్-12న రహస్యంగా జీఓ-54 జారీ అయిందని అంటున్నారు. దీనిపై వైసీపీ కూడా రాద్ధాంతం చేసింది. జీపీఎస్ వద్దన్న చంద్రబాబు.. ఆ జీఓ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఉద్యోగ సంఘాలు కూడా కొన్నిచోట్ల నిరసనలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. తాము జీపీఎస్ కి వ్యతిరేకం అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఆ జీఓ అమలు నిలిపివేయాలన్నారు. దీంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఉద్యోగులు ప్రస్తుతానికి హ్యాపీయే.. అయితే సీపీఎస్ పూర్తిగా రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) తేవాలని అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ లో సీపీఎస్ రద్దు అనే అంశం లేకపోయినా ఆ దిశగా ప్రయత్నం చేస్తామని విడిగా హామీ ఇచ్చారాయన. పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాల్లో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. వీరిద్దరి హామీలు నిలబెట్టుకుంటారా.. ఖజానాపై భారం వేసే సీపీఎస్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

First Published:  16 July 2024 3:46 AM GMT
Next Story