Telugu Global
Andhra Pradesh

ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవలు

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని, రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని ఏపీ వాతావరణ విభాగం తెలిపింది.

ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవలు
X

కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ఏపీ ప్రజలకు ఇప్పుడు ఊరట లభించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి సెలవలు ఇచ్చే అవకాశం ఉంది.


వాయు'గండం'..

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఏపీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈరోజు మరిన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయవాడలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.

First Published:  31 Aug 2024 2:32 AM GMT
Next Story