Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్.. 30రోజుల్లో ఏమేం చేశారంటే..?

డీఎస్సీ నోటిఫికేషన్, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక.. ఇలా ఈ 30రోజుల్లో జరిగిన కార్యక్రమాలన్నీ ఓ లిస్ట్ రెడీ చేసి టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఉంచింది.

చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్.. 30రోజుల్లో ఏమేం చేశారంటే..?
X

జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. నేటితో నెలరోజుల పాలన పూర్తవుతుంది. ఈ నెలరోజుల పాలనపై ఎన్నో విమర్శలు, మరెన్నో వివాదాలు. పాలన పక్కనపెట్టి దాడులు పెచ్చుమీరాయంటూ ప్రతిపక్షం విమర్శిస్తోంది. తల్లికి వందనం పేరుతో మోసం జరుగుతోందని, సూపర్ సిక్స్ సంగతేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శ్వేత పత్రాల పేరుతో అసత్య ప్రచారం జరుగుతోందనే ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తన ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసింది. చంద్రబాబు పాలనలో 30రోజుల్లో జరిగిన 30 కార్యక్రమాలు ఇవీ అంటూ ఓ లిస్ట్ బయటపెట్టింది.


డీఎస్సీ నోటిఫికేషన్, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక.. ఇలా ఈ 30రోజుల్లో జరిగిన కార్యక్రమాలన్నీ ఓ లిస్ట్ రెడీ చేసి టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఉంచింది. సూపర్ సిక్స్ కాదు, సూపర్ 30 అమలుకి శ్రీకారం చుట్టామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది.

30 రోజుల్లో 30 కార్యక్రమాలు.. అనేది వినడానికి బాగానే ఉన్నా పాలనలో సహజంగా పడే ముందడుగుల్ని కూడా లెక్కగట్టి ప్రచారం చేసుకోవడం ఏంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎర్రచందనంపై ఉక్కుపాదం, గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు, అమరావతి పునఃప్రారంభం, పోలవరం నిర్మాణం పునః ప్రారంభం అనేవి కూడా ఈ లిస్ట్ లో ఉండటం విశేషం. చంద్రబాబు ఢిల్లీ టూర్ ని కూడా 30 రోజుల్లో సాధించిన 30 ఘనతల్లో ఒకటిగా పేర్కొన్నారు. మరి దీనికి విపక్షం ఎలాంటి కౌంటర్లతో రెడీ అవుతుందో చూడాలి.

First Published:  12 July 2024 9:45 AM IST
Next Story