Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఈసారి ఎందుకంటే..?

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చ అనేవి సహజంగా వినిపించే మాటలే. కొత్త రుణాలకోసం కేంద్రం పర్మిషన్ అనేది అసలు పాయింట్.

చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఈసారి ఎందుకంటే..?
X

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారి కూడా టీడీపీ హడావిడి కాస్త గట్టిగానే ఉంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని, ఏపీకి ఏదో సాధించి తీసుకొస్తారని ఎలివేషన్లు ఇస్తున్నారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి టీడీపీ సపోర్ట్ కీలకమైన ఈ దశలో ఏపీకి కేంద్రం ప్రకటించే వరాలు ఏంటా అనే ఆసక్తి ప్రజల్లోనూ ఉంది. మరి సీఎం చంద్రబాబు ఏమేరకు కేంద్రాన్ని మెప్పించి ఏపీకి నిధులు సమీకరిస్తారో వేచి చూడాలి.

బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది, కాదు కాదు అమరావతికి అప్పు, పోలవరానికి ష్యూరిటీ కేంద్రం ఇచ్చిందని, ఇదే పెద్ద ఘనత అని టీడీపీ అంటోంది. వాస్తవానికి ఏపీ ప్రజలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఏమాత్రం రుచించలేదు. ప్రత్యేక హోదాపై నమ్మకం లేదు కానీ, ఆ స్థాయిలో ఏపీకి కేంద్రం ఏదయినా మంచి చేస్తుందనే ఆశ మాత్రం ప్రజల్లో ఉంది. కేంద్రం మెడలు వంచలేకపోయారని, హోదా సాధించలేకపోయారని.. ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ టార్గెట్ చేసింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలోని కూటమిలో కీలకంగా ఉంది. ఈ దశలో టీడీపీ సత్తా ఏంటో ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఢిల్లీలో బాబు షెడ్యూల్ ఇదే..

ఈరోజు సాయంత్రానికి చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. రేపు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ లభించినట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో కూడాబాబు సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చ అనేవి సహజంగా వినిపించే మాటలే. కొత్త రుణాలకోసం కేంద్రం పర్మిషన్ అనేది అసలు పాయింట్. గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు రీషెడ్యూల్ చేయించుకోవడం సీఎం చంద్రబాబు పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

First Published:  16 Aug 2024 6:58 AM GMT
Next Story