Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి అపాయింట్ మెంట్ లు ఇచ్చినట్టు ఏపీకి నిధులిస్తారా..?

బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు సీఎం చంద్రబాబు.

చంద్రబాబుకి అపాయింట్ మెంట్ లు ఇచ్చినట్టు ఏపీకి నిధులిస్తారా..?
X

ప్రధాని మోదీ

హోం మంత్రి అమిత్ షా

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా

జలవనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌

ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి..

24గంటల వ్యవధిలో ఏపీ సీఎం చంద్రబాబు కలసిన కేంద్ర ప్రముఖుల జాబితా ఇది. ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి.. వారందరి అపాయింట్ మెంట్ లు ఆయనకు సులభంగా లభించాయి. అయితే అంతే సులభంగా ఆయన ఏపీకి నిధులు తీసుకు రాగలరా లేదా అనేది మాత్రం అనుమానం.

ఏపీకి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఘనంగా ఉన్నాయని టీడీపీ చెబుతోంది. ప్రతిపక్ష వైసీపీ ఇందులో నిజం లేదంటోంది. అయితే పొరుగు రాష్ట్రాలు కూడా ఏపీకి కేటాయింపులు బాగున్నాయని అన్నాయి కాబట్టి ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అప్పులిచ్చినా, నిధులిచ్చినా అసలు ఏపీని గుర్తించడం, ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. అయితే అవన్నీ పేపర్లకే పరిమితమా లేక నిధుల వరద పారే అవకాశం ఉందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.

బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు సీఎం చంద్రబాబు. మిగతా మంత్రులకు కూడా ఇదే విజ్ఞప్తి చేశారని సీఎం కార్యాలయం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు.. బడ్జెట్ కేటాయింపుల కార్యాచరణే ప్రధాన అజెండాగా ప్రధానితో చర్చించారని అంటున్నారు. విశాఖ ఉక్కుకి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపివేసి, సెయిల్‌లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇక పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి డయాఫ్రం వాల్, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం పనులకు వీలైనంత త్వరగా అనుమతులు ఇచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని జలవనరుల శాఖ మంత్రిని కోరారు. మరి చంద్రబాబు వినతులకు కేంద్రం ఎంత స్పీడ్ గా స్పందిస్తుందో చూడాలి.

First Published:  18 Aug 2024 2:18 AM GMT
Next Story