అసెంబ్లీలో గందరగోళం.. సేవ్ డెమొక్రసీ అంటూ వైసీపీ నినాదాలు
గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. వుయ్ వాంట్ జస్టిస్, సేవ్ డెమొక్రసీ అంటూ వారి స్థానాల్లోనే లేచి నిలబడి నినాదాలు చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఊహించినట్టుగానే గందరగోళంగా మారాయి. వైసీపీ సభ్యులు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఈ గందరగోళం మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కూటమి అధికారంలోకి వచ్చాక గవర్నర్ ప్రసంగంతో ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైంది. ఉభయసభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ ప్రసంగించారు.
గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. వుయ్ వాంట్ జస్టిస్, సేవ్ డెమొక్రసీ అంటూ వారి స్థానాల్లోనే లేచి నిలబడి నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. వైసీపీ సభ్యులు అడ్డుతగులుతున్నా.. గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. విభజన వల్ల ఏపీకి నష్టం కలిగిందని, రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయామని, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి ఆయన తీవ్రంగా కృషి చేశారని గవర్నర్ చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019 తర్వాత అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని అన్నారు గవర్నర్.
గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. గవర్నర్ కి సీఎం చంద్రబాబు ఇతర సభ్యులు వీడ్కోలు పలికారు. ఈనెల 26 వరకు ఐదురోజులపాటు అసెంబ్లీ కొనసాగుతుంది. రేపటి నుంచి జరిగే సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కారని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగే మహాధర్నా కోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడికి వెళ్తారు.