ఈనెల 22నుంచి ఏపీ అసెంబ్లీ.. జగన్ వ్యూహం ఏంటి..?
జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తారా, చర్చల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా సభలోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
ఈనెల 22నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో అసలు ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా, ఆ పార్టీ అధినేత జగన్ సమావేశాలకు వస్తారా అనేది తేలాల్సి ఉంది.
సీట్లతో సంబంధం లేకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇటీవల జగన్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ హోదా ఇచ్చే విషయంలో స్పీకర్ నిర్ణయం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ప్రభుత్వ వాలకం చూస్తుంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తి లేదని తేలిపోయింది. టీడీపీ ట్వీట్లలో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు, జగన్ కి ప్రతిపక్ష నేతగా లభించే ప్రొటోకాల్ ఉండదని తేలిపోయింది. ఈ దశలో జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తారా, చర్చల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా సభలోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
ఇటీవల పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బలం తక్కువగా ఉంది కాబట్టి మనకు మాట్లాడే అవకాశం లేదని, శాసన మండలిలో మాత్రం అధికార పార్టీని నిలువరించాలని ఆయన నేతలకు సూచించారు. అంటే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ పాత్రపై ఆయనకు పెద్దగా అంచనాలు లేవు. గతంలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను కేవలం నిరసనలకు మాత్రమే వాడుకునేవారు. అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలతో టీడీపీ ఎమ్మెల్యేలు హడావిడి చేసేవారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా, సభ ముగిశాక సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు చంద్రబాబు. ఇప్పుడు జగన్ కూడా అదే పద్ధతి ఫాలో అవుతారా, లేక అసెంబ్లీ సమావేశాలను, సభలో జరిగే చర్చలను పూర్తిగా పట్టించుకోకుండా ఉంటారా..? అనేది వేచి చూడాలి.