ఏపీలో మరో అరెస్ట్.. న్యాయపోరాటం చేస్తామంటున్న వైసీపీ
అధికార ప్రతినిధి అరెస్ట్ అక్రమం అని అంటున్నారు వైసీపీ నేతలు. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలున్నా పోలీసులు అత్యుత్సాహం చూపించారని విమర్శించారు.
ఏపీలో వైసీపీ నేతల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానెల్ చర్చల్లో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ఆయన అరెస్ట్ కి కారణం. ఇటీవల టీడీపీ నేతలు కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా నాగార్జున యాదవ్ పై పోలీసులు నిఘా పెట్టారు. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కుప్పంలో ఆయన్ను అరెస్ట్ చేశారు.
అధికార ప్రతినిధి అరెస్ట్ అక్రమం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేయడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాలను కూడా ఏపీ పోలీసులు ధిక్కరించారని అంటున్నారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోడానికి ఈ అరెస్ట్ లను ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నారు.
వైసీపీ హయాంలో కూడా అరెస్ట్ లు జరిగాయి, చంద్రబాబు సహా మరికొందరు నేతలు జైలుకి వెళ్లారు. ఆ అరెస్ట్ ల వల్ల టీడీపీపై జనంలో సానుభూతి వచ్చిందా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా వైరి వర్గాల నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ ల నుంచి రక్షణకోసం కోర్టునుంచి ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఆ ఆదేశాలు ఉన్నా కూడా నాగార్జున యాదవ్ లాంటి నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.