Telugu Global
Andhra Pradesh

అన్న క్యాంటీన్లకు భారీ ప్రచారం.. అంతా మారిపోయినట్టేనా..?

అన్న క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే.. కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది.

అన్న క్యాంటీన్లకు భారీ ప్రచారం.. అంతా మారిపోయినట్టేనా..?
X

ఉచిత ఇసుకకు ఇంత పబ్లిసిటీ లేదు..

మెగా డీఎస్సీ విషయంలో కూడా ఈ స్థాయిలో ప్రచారం చేసుకోలేదు..

పెన్షన్ల పెంపు నెలకోసారి మాత్రమే హైలైట్ అయ్యేది..

ఇప్పుడు అన్న క్యాంటీన్ల విషయంలో మాత్రం టీడీపీ తగ్గేదే లేదంటోంది. అన్న క్యాంటీన్ల ప్రారంభం ముందు నుంచి ప్రారంభమయ్యాక కూడా వారోత్సవాల తరహాలో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అన్న క్యాంటీన్లలో అన్నం తింటున్న వారి ముందు మైక్ పెట్టడం, చంద్రబాబుని పొగిడించడం, జగన్ ని తిట్టించడం.. ఈ వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


వైసీపీకి, సాక్షి మీడియాకి ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడంలేదు. లోకేష్ అర ఇడ్లీ తిన్నారు, చంద్రబాబు నాలుగు మెతుకులు మొహమాటానికి భోంచేశారు అని వైసీపీ వేసిన ట్వీట్ వారికే రివర్స్ లో తగిలింది. పేదలు కడుపునిండా తింటుంటే.. ఎందుకీ ఏడుపంటూ టీడీపీ టార్గెట్ చేస్తోంది. ఒకవేళ అన్న క్యాంటీన్లలో ఆహారం బాలేదు, కడుపునిండా పెట్టడంలేదు అనే వార్తలిచ్చినా.. ఇప్పటికిప్పుడు ఎవరూ నమ్మరు. అందుకే అన్న క్యాంటీన్లపై ఆ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నా.. వైసీపీ సైలెంట్ గా ఉంది. సాక్షి కూడా క్యాంటీన్ వార్తల్ని పక్కనపెట్టింది.

అన్న క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే.. కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది. 26 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు 4 అన్న క్యాంటీన్లు పెట్టి ఆహా, ఓహో అంటే సరిపోతుందా. రాష్ట్రంలో అభివృద్ధి, హామీల అమలు, అమరావతి, పోలవరం.. వీటిపై కూడా దృష్టి పెట్టాలి కదా అనే వాదన వినపడుతోంది. ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ప్రజలు ఏం అడిగినా.. టీడీపీ నుంచి అన్న క్యాంటీన్లు సూపర్ అనే మాటే వినపడుతోంది.

First Published:  17 Aug 2024 10:01 AM IST
Next Story