Telugu Global
Andhra Pradesh

హడావిడిగా అన్న క్యాంటీన్లు.. అసలు కథ ఇదేనంటున్న వైసీపీ

అసలు పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే కొసరు పథకం పట్టాలెక్కించి సూపర్ సిక్స్ మొదలు పెట్టాం అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.

హడావిడిగా అన్న క్యాంటీన్లు.. అసలు కథ ఇదేనంటున్న వైసీపీ
X

అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకాల్లో అన్న క్యాంటీన్ల ఫైలు కూడా ఉంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ప్రతిపక్షం ఒత్తిడి తెస్తున్న వేళ, అన్న క్యాంటీన్లంటూ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. అయితే ఈ క్యాంటీన్ల వెనక అసలు కథ వేరే ఉందంటున్నారు వైసీపీ నేతలు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని చెబుతున్నారు.

ఆమధ్య అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు వారికి ఓ ఉపదేశం ఇచ్చారు. ప్రతి దానికి నిధులు లేవు అని చెప్పడం సరికాదన్నారు. డబ్బులు ఖర్చు కాకుండా చేసే పనులు కొన్ని ఉంటాయని, వాటిపై దృష్టిపెట్టాలని అధికారులకూ సూచించారు. ఈ అన్న క్యాంటీన్ల వ్యవస్థ కూడా అలాంటిదేనంటున్నారు వైసీపీ నేతలు. అసలు పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే కొసరు పథకం పట్టాలెక్కించి సూపర్ సిక్స్ మొదలు పెట్టామంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

తొలిదశలో ఆగస్ట్-15 నాటికి 100 క్యాంటీన్లు, మలి దశలో 83.. మొత్తంగా ఏపీలో 183 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో మొత్తం 77 మున్సిపాల్టీలు, 17 కార్పొరేషన్ లు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే మొత్తం 123 అర్బన్ స్థానిక సంస్థలకుగాను 183 క్యాంటీన్లు ఏర్పాటవుతాయి. వీటితో పేదల కడుపు నిండుతుందనేది వట్టిమాటేనని వైసీపీ విమర్శిస్తోంది. అన్న క్యాంటీన్ల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని, దీంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.

గతంలో అమ్మఒడికి దాదాపు ఆరు కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సాయం ఇస్తామంటున్నారు కాబట్టి ఈసారి తల్లికి వందనం బడ్జెట్ రూ.15 వేలకోట్లు దాటిపోతుంది. అందుకే ఆ పథకం వెనక్కి నెట్టేశారు. ఏపీలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగమే. అలా చేయాలంటే ఏడాదికి 20వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించాలి. నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాల్ని కూడా ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నారు. వీటన్నిటి గురించి అడిగితే అన్న క్యాంటీన్లు వస్తున్నాయి కాచుకోండి అంటూ టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

First Published:  31 July 2024 5:08 AM GMT
Next Story