Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు

వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు
X

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులను నియమించారు. జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్‌ గోపాలకృష్ణారావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. వీరి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేస్తే శుక్రవారం వీరు ప్రమాణం చేసే అవకాశముంది.

వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి. 1989లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో చేరి ప్రాక్టీస్‌ చేసిన ఆయన.. 1994లో సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్‌లో ఎంపికైన ఆమె.. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 2018 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం ఈ ఏడాది మే 16న ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అనుసరించి సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

First Published:  22 Aug 2024 8:43 AM IST
Next Story