Telugu Global
Andhra Pradesh

నిందితుడు ఆత్మహత్య.. టీడీపీ ట్వీట్ ఇలా ఉందేంటి..?

నిందితుడు ఆత్మహత్యకు, కఠిన శిక్షలకు సంబంధం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈ ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు సరే, మరి బాపట్ల ఘటనలో ఆ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించారు, ఎంత స్పీడ్ గా విచారణ జరుగుతోంది అని అడుగుతున్నారు.

నిందితుడు ఆత్మహత్య.. టీడీపీ ట్వీట్ ఇలా ఉందేంటి..?
X

హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకుంటే అది పోలీసుల ప్రతిభ అవుతుందా..? పోనీ ప్రభుత్వం పనితీరుకి అది నిదర్శనం అవుతుందా..? ప్రస్తుతం టీడీపీ ట్వీట్ ని ఇలానే అర్థం చేసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలికను హత్య చేసిన సురేష్ అనే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘనత తమదేనని పేర్కొంటూ టీడీపీ ట్వీట్ వేయడం ఇక్కడ విశేషం.


"ప్రభుత్వం అంటే నేరస్తులకు భయం ఉండాలి. పోలీసులు పట్టుకుని చట్టప్రకారం శిక్ష వేయిస్తారనే వణుకు ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వంలోనే అది సాధ్యం అవుతుంది. నాడు 2018లో అయినా, నేడు అయినా, పోలీసులు, ప్రభుత్వం తమని వదిలిపెట్టదని నేరస్తులు భయపడ్డారు. నేడూ అదే జరిగింది.." అంటూ టీడీపీ ట్వీట్ వేసింది. నిందితుడు సురేష్ కోసం 12 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయని.. దీంతో అతడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడంటూ వ్యాఖ్యానం జతచేసింది. కఠిన శిక్ష తప్పదు అని తెలిసి నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నట్టు తెలిపింది.

గత ప్రభుత్వ హయాంలో దిశ చట్టం ఉన్నా, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేతలు ఆరోపించేవారు. తమ ప్రభుత్వంలో పరిస్థితులు మారాయని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమధ్య బాపట్లలో ఇలాంటి ఘటన జరిగితే నేరుగా హోం మినిస్టర్ అక్కడికి వెళ్లి, బాధితుల్ని పరామర్శించారు. అనకాపల్లి జిల్లా ఘటనలో కూడా నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని హోం మినిస్టర్ మీడియాకు చెప్పారు. ఇప్పుడు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఈ కేస్ క్లోజ్ అయినట్టే లెక్క. ఈ ఆత్మహత్య ఘటనతో మిగతా వారిలో పరివర్తన వస్తుందా, నేరాలు ఆగిపోతాయా..? అనేది తేలాల్సి ఉంది.

సోషల్ మీడియా కౌంటర్లు..

నిందితుడు ఆత్మహత్యకు, కఠిన శిక్షలకు సంబంధం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈ ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు సరే, మరి బాపట్ల ఘటనలో ఆ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించారు, ఎంత స్పీడ్ గా విచారణ జరుగుతోంది అని అడుగుతున్నారు. ఆత్మహత్య ఏమో కానీ, టీడీపీ ట్వీట్ మాత్రం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు నెటిజన్లు.

First Published:  11 July 2024 9:22 AM IST
Next Story