తుంగభద్ర గేటుకి.. జగన్ కి సంబంధం ఏంటి..?
సాగునీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. కాఫర్ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానన్నారని గుర్తు చేశారు.
కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడానికి జగనే కారణం అంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ కూడా అవే ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందన్నారు. తుంగభద్ర మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏమూల ఏం జరిగినా జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు అంబటి.
జగన్ హయాంలో ఏపీలో పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయని.. ఇప్పుడు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడానికి కూడా జగనే కారణం అంటూ ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో కథనాలొచ్చాయి. అప్పట్లో అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇలాగే జరిగిందని, తుంగభద్ర డ్యామ్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం తరపున జగన్ నిధులివ్వకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆ కథనాల సారాంశం. అయితే తుంగభద్ర ప్రాజెక్ట్ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అంటున్నారు అంబటి. గేటు కొట్టుకుపోవడం వల్ల అనంతపురం జిల్లాకు వరద ముంపు ఉందని, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి. కాఫర్ డ్యాం లేకుండానే చంద్రబాబు పోలవరం నిర్మిస్తానని అన్నారని గుర్తు చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఇప్పుడు అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నాడు సూపర్ సిక్స్ అంటూ ధీమాగా చెప్పిన బాబు, ఇప్పుడు ఖజానా చూస్తే భయమేస్తోందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండున్నర నెలలకే కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటోందన్నారు అంబటి.