ముద్రగడ పద్మనాభ రెడ్డికి నా అభినందనలు..
ప్రపంచంలో పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేసిన ఏ ఒక్కరూ ఆ పని చేసి ఉండరని, కానీ తొలిసారి అలాంటి వ్యక్తి ముద్రగడను తాను చూస్తున్నానని చెప్పారు అంబటి.
వైసీపీ గెలుపుపై ఆ పార్టీ నేతలు చాలామంది సవాళ్లు విసిరారు కానీ.. ఫలితాల తర్వాత ఏ ఒక్కరూ ఓటమిపై పెద్దగా విశ్లేషణల జోలికి వెళ్లలేదు. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం తన పేరు మార్చుకుని సంచలనం సృష్టించారు. అన్నమాటమీద నిలబడ్డారంటూ ఆయన్ను చాలామంది పొగిడారు. కాపులతో ఆయనకు సంబంధాలు తెగిపోయాయని ఇక ఆయన రెడ్డి సామాజిక వర్గం కోసం పోరాటం చేయాలంటూ కొందరు సెటైర్లు పేల్చారు. ఈ క్రమంలో పేరు మార్పు తర్వాత ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆయన తెరపైకి వచ్చారు. ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయన్ను అభినందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
పవన్ కల్యాణ్ గెలుపుతో పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభంను ఎవరూ కొత్త పేరుతో పిలిచే సాహసం చేయలేదు. అలా పిలిస్తే ఆయన్ను మరింత కుంగదీసినట్టవుతుందని అనుకున్నారంతా. అయితే ఆయనకు అభినందనలు తెలుపేందుకు కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అనుకోకుండానే పాత గాయాన్ని రేపారు. అంబటి మాట్లాడుతున్నంత సేపు ముద్రగడ తీవ్ర భావోద్వేగానికి గురికావడమే దీనికి నిదర్శనం. ముద్రగడ పద్మనాభ రెడ్డి మాటమీద నిలబడ్డారని అంబటి ఆయన్ను మెచ్చుకున్నారు.
ప్రపంచంలో పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేసిన ఏ ఒక్కరూ ఆ పని చేసి ఉండరని, కానీ తొలిసారి అలాంటి వ్యక్తి ముద్రగడను తాను చూస్తున్నానని చెప్పారు అంబటి. రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్‌ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. పేరు మారినా ముద్రగడ ముద్రగడే అంటూ ప్రశంసించారు అంబటి. వంగవీటి రంగా జైలులో ఉన్నప్పుడు కాపునాడు సభకు హాజరు కావడానికి తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని గుర్తు చేశారు. కాపు ఉద్యమం వల్ల ముద్రగడ చాలా నష్టపోయినా మాటమీద నిలబడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు అంబటి రాంబాబు.