Telugu Global
Andhra Pradesh

చెట్టు నరికెయ్యడానికి చేతులెలా వచ్చాయ్..!

అన్నక్యాంటీన్ కి అడ్డుగా ఉందని 100 ఏళ్ల వయసున్న చెట్టుని కొట్టేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి కౌంటర్లకు ఆహ్వానం పలికారు.

చెట్టు నరికెయ్యడానికి చేతులెలా వచ్చాయ్..!
X

అన్న క్యాంటీన్ కి అడ్డుగా ఉందన్న కారణంతో 100 సంవత్సరాల వేపచెట్టుని అడ్డంగా నరికేశారని, ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగిందని, ఇదీ కూటమి ప్రభుత్వం నిర్వాకం అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆ చెట్టు అన్న క్యాంటీన్ కి అడ్డుగా లేదని, అయినా కూడా పనిగట్టుకుని చెట్టు కూల్చేశారని అన్నారు. అంబటి ట్వీట్ బాగానే ఉన్నా.. అది వైసీపీకి పూర్తిగా రివర్స్ అవుతోంది. సోషల్ మీడియాలో అంబటిపై ట్రోలింగ్ మొదలైంది.


ఆమధ్య అంబటి రాంబాబు.. పోలవరం అర్థంకాని సబ్జెక్ట్ అంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు. ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన మిగతా విషయాలన్నిటినీ వదిలేసి 'నాకు అర్థం కాలేదు' అనే పాయింట్ నే వైరి వర్గాలు హైలైట్ చేశాయి. ఆ దెబ్బతో ఆ అర్థంకాని సబ్జెక్ట్ గురించి, జనాలకు అర్థమయ్యేలా ఆయన మరోసారి ట్వీట్ వేయాల్సి వచ్చింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు చెట్ల నరికివేత అనే సబ్జెక్ట్ విషయంలో కూడా అంబటి వైరి వర్గాలకు దొరికిపోయారు. పాత లెక్కలన్నీ వారు ఇప్పుడు బయటపెడుతున్నారు. వైసీపీ హయాంలో నరికిన చెట్లెన్ని, కూలిన వృక్షరాజాలెన్ని అంటూ లెక్కలు తీస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు. గతంలో సీఎం పర్యటన అంటేనే ఆయా ప్రాంతాల్లో చెట్లకు చేటు వచ్చేదని ఎద్దేవా చేస్తున్నారు. పోయి పోయి చెట్టు గురించి ట్వీట్ వేసి, పాత చరిత్ర అంతా తవ్వేలా చేశారు అంబటి రాంబాబు.

జగన్ పర్యటనలో పలు సెక్యూరిటీ కారణాల వల్ల చెట్లు కొట్టేశారు కానీ, సరదాకోసం కాదని వైసీపీ చాలాసార్లు వివరణ ఇచ్చింది. కానీ టీడీపీ మాత్రం దాన్ని పెద్ద నేరంగా చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక తన పర్యటనలకోసం చెట్లు కొట్టేయొద్దని, పరదాలు కట్టే అలవాటు మానుకోవాలని సీఎం చంద్రబాబు బహిరంగంగానే ఆదేశాలిస్తున్నారు. ఈ క్రమంలో అన్నక్యాంటీన్ కి అడ్డుగా ఉందని 100 ఏళ్ల వయసున్న చెట్టుని కొట్టేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి కౌంటర్లకు ఆహ్వానం పలికారు.

First Published:  16 July 2024 5:16 PM IST
Next Story