Telugu Global
Andhra Pradesh

దేవాన్ష్ కి ఆరుగురు సెక్యూరిటీ.. జగన్ పై నిందలెందుకు..?

జగన్‌కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు అంబటి రాంబాబు. జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారని, లోకేష్ జ్ఞానం లేకుండా ట్వీట్స్ వేస్తున్నారని విమర్శించారు.

దేవాన్ష్ కి ఆరుగురు సెక్యూరిటీ.. జగన్ పై నిందలెందుకు..?
X

జగన్ కి 986 మంది సెక్యూరిటీగా ఉన్నారంటూ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేవలం 139 మంది మాత్రమే సెక్యూరిటీగా ఉన్నారని వివరణ ఇచ్చారు. గోబెల్స్ ప్రచారం చేయటంలో సీఎం చంద్రబాబు ముందుంటారని, ఆయన దారిలో హోంమంత్రి, ఎల్లోమీడియా నడుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని, కానీ జగన్ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాన్ని పంపుతున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు అంబటి. లోకేష్ కుమారుడు దేవాన్ష్‌కి కూడా ఆరుగురు సెక్యూరిటీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు అంబటి. జగన్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం తీరుని ఆయన తప్పుబట్టారు. జగన్ ఎన్నికల్లో కేవలం ఓడిపోయారు, కానీ చనిపోలేదంటూ అయ్యన్నపాత్రుడు అన్న మాటల్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లామన్నారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్‌గా ఎంపిక చేయటం వెనుక కూడా ప్రత్యేక కారణం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు అంబటి.

జగన్‌కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు అంబటి రాంబాబు. జగన్‌ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తరలి వస్తున్నారని చెప్పారు. జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారని, లోకేష్ జ్ఞానం లేకుండా ట్వీట్స్ వేస్తున్నారని విమర్శించారు. అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ తెచ్చుకున్నారని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని తగ్గించాలని ఎవరూ కోరలేదని గుర్తు చేశారు. మరిప్పుడు జగన్ సెక్యూరిటీని ఎందుకు తగ్గించారని సూటిగా ప్రశ్నించారు అంబటి.

First Published:  7 Aug 2024 5:39 PM IST
Next Story