Telugu Global
Andhra Pradesh

ఏపీయా..? మణిపూరా..? బీహారా..?

ఏపీ పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చరిత్ర వారిని క్షమించదన్నారు అంబటి రాంబాబు.

ఏపీయా..? మణిపూరా..? బీహారా..?
X

ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పల్నాడులో వైసీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్‌ ఘటనపై ఆయన ఘాటుగా స్పందించారు. నాగరాజుకి ఏదైనా జరిగితే దానికి పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తిని నడిరోడ్డుపై కిడ్నాప్ చేశారని అన్నారు అంబటి.


మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారని, ఇక్కడ కూడా టీడీపీ నేతలు ఆయన్ను వెంటాడి, దాడి చేసి, వారి కుటుంబ సభ్యుల ముందే కొట్టి కిడ్నాప్ చేశారని అన్నారు అంబటి రాంబాబు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? లేదా అని ప్రశ్నించారు. వినుకొండలో నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని అసలిది ఏపీయా, బీహారా, మణిపూరా అర్థం కావడంలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు.

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు అంబటి రాంబాబు. పోలీసులు కూడా టీడీపీ వారిని ఏమీ చేయట్లేదన్నారు. చంద్రబాబు, లోకేష్, హోం మంత్రి కూడా టీడీపీ నేతల్ని సమర్థిస్తున్నారని, అందుకే పోలీసులు వారిని ఏమీ చేయలేకపోతున్నారని చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. నంద్యాలలో హత్య జరిగితే పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేశారని, ముందుగా పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు అంబటి. ఏపీలో చట్టం తన పని తాను చేసుకునిపోయే పరిస్థితులు లేవన్నారాయన. ఏపీలో ఆటవిక రాజ్యం సాగుతోందన్నారు. అన్యాయాలు, అక్రమాలు రాజ్యం చేస్తున్నాయని అన్నారు. ఏపీ పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చరిత్ర వారిని క్షమించదన్నారు అంబటి రాంబాబు.

First Published:  8 Aug 2024 11:27 AM GMT
Next Story