వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి
ఏపీలో జిల్లా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను.. వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లా అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చింది.
టికెట్ బుకింగ్ ఇలా..
వాట్సప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సేవల్లో భాగంగా 9552300009 నంబర్‌కు మొదట హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఏయే సేవల్లో అందుబాటులో ఉన్నాయో చూపెడుతుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/ రద్దు అనేక ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్ చేస్తే.. ఏయే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలను చూపెడుతుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్‌లైన్, డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సప్ నంబర్‌కు టికెట్ వస్తుంది.