Telugu Global
Andhra Pradesh

అన్నక్యాంటీన్లపై మరో వివాదం..

అన్నం పెడతామని పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఓ ట్వీట్ వేసింది. గతిలేక తినడానికి వస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తారా..? అని ప్రశ్నించింది.

అన్నక్యాంటీన్లపై మరో వివాదం..
X

అన్న క్యాంటీన్ల ఏర్పాటు, వాటి గురించి టీడీపీ చేసుకుంటున్న ప్రచారంపై గతంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం ఏంటని నిలదీశారు వైసీపీ నేతలు. తాజాగా అన్న క్యాంటీన్లపై మరో ఆరోపణ చేస్తోంది వైసీపీ. అక్కడ పరిశుభ్ర వాతావరణం లేదని, అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లు కడిగి భోజనం పెడుతున్నారని, అన్నం పెడతామని పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఓ ట్వీట్ వేసింది. గతిలేక తినడానికి వస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తారా..? అని ప్రశ్నించింది.


పేదలకు రూ.5 కే భోజనం పెడుతున్నామని ప్రచారం చేసుకుంటూ, పచ్చ ప్రభుత్వం చేస్తున్న దగుల్బాజీ పని ఇది.. అంటూ వైసీపీ ఓ వీడియోని తన ట్వీట్ కి జత చేసింది. తణుకు అన్న క్యాంటీన్లో ఇలాగే జరుగుతోందని చెప్పింది. పేదలకు పెట్టే తిండి, వారికి ఇచ్చే మర్యాద ఇదేనా? అని నిలదీసింది. అందుకే అర ముక్క ఇడ్లీతో లోకేష్, చెంచా రైస్ తో చంద్రబాబు.. అన్న క్యాంటీన్లో అన్నం తిన్నట్టు నాటకమాడారని కౌంటర్ ఇచ్చింది. ఈ ట్వీట్ కి మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై వైసీపీ బ్యాచ్ విషం చిమ్ముతోందని లోకేష్ బదులిచ్చారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నాయని లోకేష్ మండిపడ్డారు.


వైసీపీ ట్వీట్ తో టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా యాక్టివేట్ అయింది. అసలు అన్న క్యాంటీన్లో ఆహారం ఎలా వండుతారు, వంటగది, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటాయి, తిన్న ప్లేట్లను ఎలా శుభ్రం చేస్తారు..? వంటి వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా వైసీపీ పోస్ట్ చేసిన వీడియో ఫేక్ అని చెప్పించారు.


మొత్తమ్మీద మరోసారి అన్న క్యాంటీన్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో అన్న క్యాంటీన్ల ప్రారంభం సందర్భంగా వరుస వీడియోలతో ప్రచారం చేసుకున్న టీడీపీ, మరోసారి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచింది.

First Published:  27 Aug 2024 2:58 AM GMT
Next Story