పార్టీ ఆఫీస్ కూడా కూల్చేశారు.. ఆళ్లనాని పయనం ఎటు..?
వైసీపీ అధికారంలో ఉంటే మంత్రి పదవుల్లో ఉంటారు, అధికారం పోయేసరికి కనీసం ప్రాథమిక సభ్యుడిగా ఉండేందుకు కూడా ఆళ్లనాని లాంటివారు ఇష్టపడటం లేదు.
జగన్ కేబినెట్ లో మంత్రి గా పనిచేసిన వైసీపీ కీలక నేత ఆళ్లనాని ఒకేరోజు పార్టీని మరింత ఇరుకున పెట్టారు. గతంలో పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించిన ఆయన, ఈరోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఇదే రోజు ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్ కూడా నేలమట్టం అయింది. పార్టీ ఆఫీస్ కూల్చేయడానికి కారణాలు ఏవయినా ఉండొచ్చు.. కానీ ముందస్తు సమాచారం లేకపోవడంతో దీనిపై పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఏలూరు వైసీపీ ఆఫీసు ఖాళీ అయిందని, పార్టీకి ఆఫీస్ అవసరం లేకపోవడంతోనే కూల్చేశారని, ఇప్పటికే కుప్పం వైసీపీ ఆఫీస్ మూతపడిందని, అనేక జిల్లాల్లో వైసీపీ ఆఫీసులు మూసివేస్తున్నారంటూ టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. పార్టీని పట్టించుకోకుండా జగన్ బెంగళూరులో ఉండే సరికి వైసీపీ నేతలు తలబాదుకుంటున్నారని కూడా కౌంటర్ ఇచ్చింది.
ఏలూరు వైసీపీ ఆఫీసు ఖాళీ..
— Telugu Desam Party (@JaiTDP) August 17, 2024
వైసీపీకి ఇక పార్టీ ఆఫీసు అవసరం లేకపోవటంతో, ఆఫీసు కూల్చేసి హోటల్ కడుతున్న నేతలు..
ఇప్పటికే కుప్పం వైసీపీ పార్టీ ఆఫీసు సహా, అనేక జిల్లాల్లో వైసీపీ ఆఫీసులు మూసివేత..
పార్టీని గాలికి వదిలేసి బెంగళూరులో జగన్ ఎంజాయ్ చేస్తూ ఉండటంతో, ఇదేమి రాజకీయ పార్టీ అంటూ తల… pic.twitter.com/5DctKGU8XZ
వైసీపీ ఈ ట్వీట్ కి వెంటనే రిప్లై ఇచ్చింది. లీజు ముగిసిన బిల్డింగ్‌ను ఖాళీ చేసినా తప్పుడు ప్రచారమేనా అని ప్రశ్నించింది. ఏలూరులో వైసీపీ కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తోందని, కొన్నిరోజుల్లోనే అది అందుబాటులోకి వస్తుందని ఆ ఆఫీస్ ఫొటోలు కూడా బయటపెట్టింది. నడిచొచ్చే 75 ఏళ్ల అబద్ధానికి సిసలైన వారసుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా నుంచి నిజాలు ఆశించడం వృథా ప్రయాసేనని బదులిచ్చింది వైసీపీ.
లీజు ముగిసిన బిల్డింగ్‌ను ఖాళీ చేసినా.. తప్పుడు ప్రచారమేనా @JaiTDP?
— YSR Congress Party (@YSRCParty) August 17, 2024
ఏలూరులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తోంది. కొన్నిరోజుల్లోనే అది అందుబాటులోకి వస్తుంది. ఆ కార్యాలయం ఫోటోలు ఇవిగో.
నడిచొచ్చే 75 ఏళ్ల అబద్ధానికి సిసలైన వారసుడు, నిక్కర్ మంత్రి… https://t.co/BqRxhAKarq pic.twitter.com/v0popWCB0m
పార్టీ ఆఫీస్ విషయంలో నిజం చెప్పారు సరే, ఆళ్లనాని రాజీనామాపై వైసీపీలో ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం. కనీసం సాక్షి మీడియా కూడా ఆయన ప్రెస్ మీట్ ని చూపించలేదు. ఏదో వ్యక్తిగత కారణాలంటూ ఆయన చెప్పుకుంటున్నా, ఏలూరు జిల్లా వైసీపీలో ఇదో పెద్ద కుదుపు అని అంటున్నారు నేతలు. కీలక నేత పార్టీని వీడిపోతున్నా కనీసం ఏం జరిగింది అనే విషయంలో వైసీపీ ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఇక్కడ టీడీపీని నిందించడానికేం లేదు, ఆళ్లనాని ఎందుకు పార్టీని వీడారో వైసీపీ క్లారిటీ ఇస్తే బాగుండేది. అధికారంలో ఉంటే మంత్రి పదవుల్లో ఉంటారు, అధికారం పోతే కనీసం ప్రాథమిక సభ్యుడిగా ఉండేందుకు కూడా ఆళ్లనాని లాంటివారు ఇష్టపడటం లేదు. ఈ విషయంలో ఆళ్ల నానిని విమర్శించేందుకు కూడా వైసీపీ వెనకడుగు వేయడమే విచిత్రం.