నేడు బాబు పర్యటన, రేపు జగన్ పరామర్శ..
ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 17మంది స్పాట్ లోనే మృతిచెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన ఘటనా స్థలానికి వెళ్తారు. దుర్ఘటనకు కారణాలు తెలుసుకుంటారు. బాధితుల్ని పరామర్శిస్తారు. బాధితులతో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు పరిహారాన్ని ప్రకటించే అవకాశముంది.
వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన పరామర్శకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
కోటి రూపాయలు ఇవ్వాలి..
గత వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎవరూ ఊహించని విధంగా మరణించిన వారి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జగన్. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని అన్నారాయన.