Telugu Global
Andhra Pradesh

విజయవాడ వద్దు.. పిఠాపురానికే జిందాబాద్

ఎన్నికల ప్రచారంలో కూడా పిఠాపురంలో సినిమావాళ్ల సందడి కనపడింది. ఎన్నికలైన తర్వాత సినిమా ప్రచారాలకోసం నటీనటులు ఇక్కడికి రాబోతున్నారు.

విజయవాడ వద్దు.. పిఠాపురానికే జిందాబాద్
X

ఏపీలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటే ముందుగా విజయవాడనే ప్రిఫర్ చేస్తారు, లేదంటే విశాఖ వెళ్తారు. కానీ తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు ఇప్పుడు పిఠాపురం కీలకంగా మారుతోంది. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎంగా మారడంతో టాలీవుడ్ అక్కడ దృష్టి కేంద్రీకరించింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరది నార్నె నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో నిర్వహించబోతున్నారు. ఈ సినిమా నిర్మాత జనసేనలో కీలకంగా ఉన్న బన్నీవాసు కావడం విశేషం.

సినిమా నిర్మాత బన్నీవాసు అయినా ఈ సినిమా నిర్మించింది గీతా ఆర్ట్స్-2 బ్యానర్. అంటే అల్లు అరవింద్ సెకండ్ బ్యానర్ అన్నమాట. అల్లు అరవింద్ అంటే కచ్చితంగా అల్లు అర్జున్ పేరు కూడా వినపడాల్సిందే. అయితే పిఠాపురంలో అల్లు అర్జున్ పేరు వినపడితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అనేది కాస్త అనుమానించాల్సిన విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఇది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవగా సీన్ క్రియేట్ ఏయింది. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీ తీసిన సినిమా ప్రమోషన్ కార్యక్రమం పిఠాపురంలో నిర్వహించాలనుకోవడం విశేషం.

ఈ వివాదం సంగతి పక్కనపెడితే.. సినిమావాళ్లు పిఠాపురం వస్తున్నారనడంతో ఆ నియోజకవర్గ ప్రజలు సంబరపడిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పిఠాపురంలో సినిమావాళ్ల సందడి ఓ రేంజ్ లో కనపడింది. సినీ నటులు, జబర్దస్త్ నటులు పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా పవన్ కోసం పిఠాపురానికి వచ్చారు. ఎన్నికలైన తర్వాత సినిమా ప్రచారాలకోసం నటీనటులు ఇక్కడికి రాబోతున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ ని గెలిపించిన పిఠాపురంలో ఇప్పుడు సినిమా సందడి కొనసాగుతోంది.

First Published:  4 Aug 2024 8:29 AM IST
Next Story