ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా?
Travel Insurance: సోలోగా లేదా ఫ్రెండ్స్, ఫ్యామిలీతోకలిసి టూర్స్ వేస్తున్నారు. అయితే ఇలా తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బిజీ లైఫ్‌స్టైల్‌కు అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చేందుకు ఈ రోజుల్లో చాలామంది ట్రావెలింగ్ వైపు అడుగులేస్తున్నారు. సోలోగా లేదా ఫ్రెండ్స్, ఫ్యామిలీతోకలిసి టూర్స్ వేస్తున్నారు. అయితే ఇలా తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అసలెందుకీ ఇన్సూరెన్స్? దీంతో లాభాలేంటి?
సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి లేదా ఇతర పనుల మీద రకరకాల ప్రాంతాలకు ట్రావెల్ చేస్తుంటారు చాలామంది. కొన్నిసార్లు విదేశాలకుకూడా పయనమవుతుంటారు. అయితే ప్రతీసారి ప్రయాణం సాఫీగా సాగితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా అనుకోని కారణాల వల్ల ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం, లగేజీ పోగొట్టుకోవడం లేదా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ సేఫ్టీగా పనికొస్తుంది. దీంతో ఎలాంటి లాభాలుంటాయంటే..
అవసరాలను బట్టి
ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? అక్కడ ఎంతకాలం ఉంటారు? ఎంతమంది వెళ్తున్నారు? వాళ్ల వయసు.. ఇలా రకాన్ని బట్టి రకరకాల ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు సోలోగా ట్రావెల్ చేస్తున్నట్టయితే.. పర్సనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇవి తక్కువ ప్రీమియంతో లభిస్తాయి. లగేజీ మిస్సింగ్, ఫ్లైట్ క్యాన్సిల్, యాక్సిడెంట్స్ వంటివి ఇందులో కవర్ అవుతాయి. ఒకవేళ ఫ్యామిలీతో కలిసి ప్రయాణిస్తుంటే ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. అనారోగ్యం, ప్రమాదాలు, బ్యాగేజీ మిస్సింగ్ ఇలా ఇందులో రకరకాల ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కుటుంబంలోని అందరికీ కలిపి ఒకే పాలసీ తీసుకోవచ్చు.
విదేశీ ప్రయాణాల కోసం
ఇకపోతే విదేశాలకు ట్రావెల్ చేసేవాళ్లకు ఇన్సూరెన్స్ బాగా పనికొస్తుంది. ట్రావెలింగ్‌లో కనెక్టింగ్ ఫ్లైట్లు అందుకోలేకపోవడం, అనారోగ్యం, లగేజీ కోల్పోవడం, ఫ్లైట్ హైజాక్, పాస్‌పోర్ట్ కోల్పోవడం, ఇతర ప్రమాదాలు వంటివన్నీ ఇందులో కవర్ అవుతాయి. విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ఇన్సూరెన్స్ సహకరిస్తుంది. ఇదే విధంగా డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.
ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్
ఇకపోతే ప్రయాణాల్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయినప్పుడు అవసరమయ్యే విధంగా అచ్చంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇది కేవలం ఆరోగ్యపరమైన ఖర్చులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
వీటితోపాటు సింగిల్ ట్రిప్ ఇన్సూరెన్స్ పాలసీలు, మల్టీ ట్రిప్ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్, సీనియర్ సిటిజెన్స్ పాలసీలు.. ఇలా ప్రయాణ అవసరలాకు తగ్గట్టుగా రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఒత్తిడి లేకుండా ప్రయాణాలు సాగేందుకు ఇన్సూరెన్స్‌లు ఉపయోగపడతాయి. అయితే పాలసీ తీసుకునే ముందు ఏమేం కవర్ అవుతాయి అనేది పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.